Sat Nov 23 2024 01:05:37 GMT+0000 (Coordinated Universal Time)
కన్నకొడుకునే చంపించిన తల్లిదండ్రులు.. దర్యాప్తులో వెల్లడైన నిజనిజాలు
సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలం శూన్యంపహాడ్ వద్ద అక్టోబరు 19వ తేదీన మూసీ నదిలో గుర్తు తెలియని మృతదేహం
నవమాసాలు మోసి కని, పెంచుకున్న కన్నబిడ్డలపై తల్లిదండ్రులకు ఎనలేని ప్రేమాభిమానాలుంటాయి. పిల్లలకు చిన్న గాయమైనా తట్టుకోలేరు. తమ పిల్లలు తప్పు చేసినా.. సర్దిచెప్పుకుంటుంటారు. కానీ.. కడుపున పుట్టిన పిల్లలే మేకులా తయారైతే ఇలాంటి పరిస్థితే ఎదురైంది ఆ తల్లిదండ్రులకి. అందుకే కన్న మమకారాన్ని చంపుకుని.. సుపారీ ఇచ్చి కొడుకుని చంపించారు. ఈ హదయ విదారక ఘటన తెలంగాణలోని హుజూర్ నగర్ పరిధిలో చోటుచేసుకుంది.
సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలం శూన్యంపహాడ్ వద్ద అక్టోబరు 19వ తేదీన మూసీ నదిలో గుర్తు తెలియని మృతదేహం లభ్యమైన కేసు దర్యాప్తులో ఈ విషయం వెలుగు చూసింది. ఈ ఘటన పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేయగా.. అందులో వెల్లడైన నిజనిజాలు విని పోలీసులు సైతం విస్తుపోయారు. ఖమ్మానికి చెందిన క్షత్రియ రామ్‌సింగ్, రాణిబాయి దంపతుల ఒక్కగానొక్క కుమారుడు సాయినాథ్ (26). రామ్‌సింగ్ సత్తుపల్లిలోని ఓ రెసిడెన్షియల్ కళాశాలలో ప్రిన్సిపల్‌గా పనిచేస్తున్నారు. డిగ్రీ చదువు మధ్యలోనే ఆపేసిన సాయినాథ్.. వ్యసనాలకు బానిసగా మారాడు.
కష్టపడి ఏ పనీ చేయకపోగా.. తల్లిదండ్రులకు భారమయ్యాడు. తన అవసరాల కోసం డబ్బు ఇవ్వాలంటూ నాలుగేళ్లుగా వారిని వేధించసాగాడు. ఇటీవల కన్నతల్లి పట్ల అనుచితంగా ప్రవర్తించాడు. దాంతో సాయినాథ్ ను అంతమొందించాలని నిర్ణయించుకున్నారు. వెంటనే నల్గొండ జిల్లా మిర్యాలగూడలో నివాసముంటున్న రాణిబాయి తమ్ముడు సత్యనారాయణసింగ్‌కు ఈ విషయాన్ని తెలియజేశారు. తన అక్క, బావలు చెప్పిన విషయాన్ని సమర్థించిన సత్యనారాయణ సింగ్ తనకు తెలిసిన మిర్యాలగూడ మండలం ధీరావత్ తండాకు చెందిన ఆటో డ్రైవర్ రమావత్ రవిని ఆశ్రయించాడు. అదే తండాకు చెందిన పనుగొతు నాగరాజు, బూరుగు రాంబాబు, త్రిపురారం మండలం రాజేంద్రనగర్‌కు చెందిన ధనావత్ సాయితో రూ.8 లక్షలకు హత్య చేసేందుకు రవి ఒప్పందం చేసుకున్నాడు.
అక్టోబరు 18వ తేదీన సత్యనారాయణసింగ్, రవి కలిసి నల్గొండ జిల్లా కల్లేపల్లిలోని మైసమ్మ దేవాలయం వద్ద పార్టీ చేసుకుందామని నమ్మించి సాయినాథ్‌ను తీసుకెళ్లారు. అందరూ కలిసి మద్యం తాగారు. అనంతరం సాయినాథ్ మెడకు ఉరి బిగించి చంపేశారు. సాయినాథ్ కారులోనే మృతదేహాన్ని తీసుకెళ్లి మూసీ నదిలో పడేశారు. మరుసటి రోజు శవం నదిలో తేలడంతో పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. వార్తల ద్వారా విషయం తెలిసిందంటూ మూడు రోజులకు తల్లిదండ్రులు వచ్చి మృతదేహన్ని తీసుకెళ్లారు. ఈ కేసులో సీసీ కెమెరాల ఫుటేజీలే కీలకమయ్యాయి. సాయినాథ్ హత్య జరిగిన రోజు శూన్యంపహాడ్ వద్ద కనిపించిన కారు.. మృతుడి తల్లిదండ్రులు తీసుకొచ్చిన కారు ఒకటేనని నిర్ధారించుకున్నారు.
మృతుడి తల్లిదండ్రులను అదుపులోకి తీసుకుని విచారించగా.. సాయినాథ్ ను తామే చంపించినట్లు అంగీకరించారు. తల్లిదండ్రులు, మేనమామతో పాటు హత్యకు సుపారి తీసుకున్న వారిలో నలుగురిని అరెస్టు చేశారు. మరో వ్యక్తి పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు.
Next Story