Mon Dec 23 2024 04:05:15 GMT+0000 (Coordinated Universal Time)
దర్శి దారుణంపై కీలక విషయాలు బయట పెట్టిన పోలీసులు
ప్రకాశం జిల్లా దర్శి మండలం బొట్లపాలెంలో దళిత వితంతు మహిళపై జరిగిన దాడి
ప్రకాశం జిల్లా దర్శి మండలం బొట్లపాలెంలో దళిత వితంతు మహిళపై జరిగిన దాడి వివరాలను పోలీసులు వెల్లడించారు. ఒంగోలులో జిల్లా ఎస్పీ మలికా గార్గ్ మీడియా సమావేశం నిర్వహించారు. దళిత మహిళపై దాడి ప్రణాళిక ప్రకారమే చేశారని, ఆమెను చిత్ర హింసలకు గురిచేశారని చెప్పారు. బాధితురాలిపై పెట్రోల్ పోసి చంపడానికి ప్రయత్నిస్తున్న సమయంలో పోలీసులు వెళ్లి ఆ మహిళను కాపాడారని తెలిపారు.
దర్శి మండలం బొట్లపాలెంలో గంగిరెడ్డి బ్రహ్మారెడ్డి, పుల్లమ్మల కుమార్తె భార్గవి, అదే గ్రామంలో దళిత వర్గానికి చెందిన సాయిరాం ప్రేమించుకొని వివాహం చేసుకున్నారు. వివాహం అనంతరం వీరిద్దరూ వేరే ప్రాంతంలో ఉండటం వల్ల వారి ఆచూకీ కోసం బ్రహ్మారెడ్డి ప్రయత్నిస్తున్నారు. గ్రామంలో నివాసం ఉంటున్న సాయిరాం సోదరి మౌనికకు ఆ ప్రేమ వ్యవహరాలు అన్నీ తెలుసని, భార్గవి సమాచారం కూడా తెలిసి ఉంటుందని భావించి ఆమెపై కక్ష పెంచుకున్నారు. ఈ నేపథ్యంలోనే సోమవారం అర్థరాత్రి దాటిన తరువాత మంచి నీళ్లు పట్టుకోడానికి మౌనిక కొళాయి వద్దకు రావడంతో బ్రహ్మారెడ్డి, అతడి భార్య పుల్లమ్మ ఆమెను అపహరించి, వాళ్ల ఇంటికి తీసుకువెళ్లారు. మౌనికపై ఇనుప రాడ్లతో బలంగా కొట్టారని, కాళ్లూ ,చేతులు కట్టి, మర్మావయవాలమీద దాడి చేశారు. అనంతరం పెట్రోల్ పోసి తగలబెట్టే ప్రయత్నం చేశారని మాలికా గార్గ్ చెప్పుకొచ్చారు. అదే సమయంలో మౌనిక తల్లి అనురాధా డయల్ 100కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వడంతో దర్శి పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి వెళ్లి మౌనికను కాపాడారని తెలిపారు. మౌనికకు పూర్తి స్థాయిలో చికిత్స అందిస్తున్నామని స్పష్టం చేశారు. మౌనికపై దాడికి పాల్పడిన బ్రహ్మారెడ్డి, పుల్లమ్మ అరెస్టు చేసినట్లు ఎస్పీ తెలిపారు.
బొట్లపాలెం ఎస్సీ కాలనీకి చెందిన కామునూరి అనురాధకు కుమారుడు సాయిరాం, కుమార్తె మౌనిక ఉన్నారు. సాయిరాం అదే గ్రామానికి చెందిన బ్రహ్మారెడ్డి, పుల్లమ్మ దంపతుల కుమార్తె భార్గవి ప్రేమ వివాహం చేసుకున్నారు. పోలీసులను కలిసి అమ్మాయి కుటుంబం నుంచి రక్షణ కల్పించాలని కోరగా, జిల్లా ఎస్పీ అందుకు అంగీకరించారు. స్థానిక పోలీసులు అమ్మాయి తల్లిదండ్రులను పిలిపించి భవిష్యత్లో ఎటువంటి గొడవలు పడకుండా ఉండాలని సూచించారు. సాయిరాం, భార్గవి ఊరికి దూరంగా వేరే ప్రాంతానికి వెళ్లి జీవిస్తున్నారు. పరువు పోయిందనే కక్షను అమ్మాయి తల్లిదండ్రులు పెంచుకుని ఈ దాడికి తెగబడ్డారు.
Next Story