హెటల్ గదిలో భార్య హత్య.. కేసును చేధించిన పోలీసులు
గత ఆదివారం యూపీలోని ఓ హోటల్ లో జరిగిన మహిళ హత్య కేసును పోలీసులు ఎట్టకేలకు చేధించారు.
గత ఆదివారం యూపీలోని ఓ హోటల్ లో జరిగిన మహిళ హత్య కేసును పోలీసులు ఎట్టకేలకు చేధించారు. హోటల్ లో గదిలో ఓ మహిళను దారుణంగా హతమార్చి, తల, మొండెం వేరుచేసి.. నగ్నంగా రక్తపు మడుగులో పడి ఉన్న మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. గత ఆదివారం జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపింది. ఆ మహిళను అంత దారుణంగా ఎవరు చంపారని పోలీసులు విచారణ చేయగా.. ఆఖరికి ఆమె భర్తే ఈ దారుణానికి పాల్పడినట్లు తేలింది. హత్యానంతరం పరారైన భర్త ఆచూకీని కనుగొన్న పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళ్తే..
ఏడాది క్రితమే వివాహం...
ఉత్తరప్రదేశ్‌లోని పన్వేల్‌కు చెందిన పూనమ్‌కు, రాంపాల్‌కు ఏడాది క్రితం వివాహమైంది. పూనమ్ స్థానిక హాస్పిటల్లో నర్స్ గా పని చేస్తోంది. పెళ్లైన కొత్తలో వీరి కాపురం సజావుగానే సాగినా.. ఆ తర్వాత భర్తకు పూనమ్ పై వచ్చిన అనుమానం క్రమంగా పెరిగింది. భార్య మరొకరితో మాట్లాడుతుందేమోనని రాంపాల్ కు వచ్చిన అనుమానం.. క్రమంగా కక్షగా మారింది. దీంతో ఆమెను ఎలాగైనా హతమార్చాలనుకున్నాడు. ప్లాన్ ప్రకారం గత ఆదివారం స్థానిక రైల్వేస్టేషన్ కు ఎదురుగా ఉన్న లాడ్జికి తీసుకెళ్లి.. అతికిరాతకంగా చంపేశాడు. భార్యను చంపిన అనంతరం తాను పోలీసులకు దొరకూడదనుకున్న రాంపాల్.. భార్య తల, టాటూ ఉన్న చేతిని నరికి, ఆమె బట్టలు తీసేసి నగ్నంగా మార్చి అక్కడి నుంచి పరారయ్యాడు.
భర్తే నిందితుడు...
ఆ తర్వాత ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులకు హత్య తాలూకు ఒక్క క్లూ కూడా లభించలేదు. దాంతో కేసును సవాల్ గా తీసుకుని విచారణ ప్రారంభించారు. హత్య జరిగిన హోటల్ కు 50 కిలోమీటర్ల దూరంలో ఒక లేడీ హ్యాండ్ బ్యాగ్ ని గుర్తించిన పోలీసులు అందులో ఉన్న ఆధార్ కార్డు ఆధారంగా మృతురాలు పూనమ్ అని గుర్తించారు. ఆమె వివరాలను సేకరించిన పోలీసులు.. భర్త రాంపాల్ కోసం గాలించగా.. ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. రాంపాల్ ను అరెస్ట్ చేసి, కోర్టుకు తరలించారు.