Mon Dec 23 2024 07:24:16 GMT+0000 (Coordinated Universal Time)
అప్సర హత్యకేసు : బంగారు మైసమ్మ ఆలయానికి సంప్రోక్షణ
శనివారం (జూన్10) అప్సర మృతదేహానికి ఉస్మానియాలో పోస్టుమార్టం పూర్తైంది. ఉస్మానియా ఫోరెన్సిక్ వైద్యుడు యాదయ్య బృందం..
ప్రేమ పేరుతో వంచించడమే కాకుండా, పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేసిందన్న కోపంతో అప్సర(30) అనే మహిళను బంగారు మైసమ్మ ఆలయంలో అర్చకుడిగా ఉన్న వెంకటసాయి సూర్యకృష్ణ దారుణంగా హతమార్చిన విషయం తెలిసిందే. శనివారం (జూన్10) అప్సర మృతదేహానికి ఉస్మానియాలో పోస్టుమార్టం పూర్తైంది. ఉస్మానియా ఫోరెన్సిక్ వైద్యుడు యాదయ్య బృందం అప్సర మృతదేహానికి పోస్టుమార్టం చేసి నివేదికను పోలీసులకు అందించారు. అప్సర తలపై బలంగా కొట్టడం వల్లే ఆమె చనిపోయిందని పోస్టుమార్టంలో నిర్థారించారు. అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. సరూర్ నగర్ లో అప్సర అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
అప్సర హత్యకేసులో నిందితుడిగా ఉన్న సాయికృష్ణను పోలీసులు రిమాండ్ కు పంపించారు. శంషాబాద్ జడ్జి 14 రోజులు రిమాండ్ విధించగా అతడిని చర్లపల్లి జైలుకు తరలించారు. సాయికృష్ణ వాట్సాప్ చాట్ ఆధారంగా.. అతను అప్సరకు ప్రేమిస్తున్నట్లు మెసేజ్ పెట్టాడని పోలీసులు తెలిపారు. ఇదిలా ఉండగా.. సాయికృష్ణ అర్చకత్వం వహించే బంగారు మైసమ్మ ఆలయానికి అర్చకులు సంప్రోక్షణ చేశారు. సాయికృష్ణ-అప్సరలు ఆ ఆలయంలో పరిచయం అవడం, అక్కడే మాట్లాడుకోవడంతో పాటు.. అప్సరను హత్యచేశాక కూడా సాయికృష్ణ ఆలయ పరిసరాల్లో తిరగడంతో సంప్రోక్షణ చేశారు. అప్సర మృతదేహానికి అంత్యక్రియలు పూర్తయ్యాక.. ఆలయంలో శాంతి హోమం నిర్వహించనున్నారు.
Next Story