Mon Dec 23 2024 20:30:58 GMT+0000 (Coordinated Universal Time)
10 కోట్ల సొమ్ముతో జల్సాలు..మరణానంతరం వెలుగులోకొచ్చిన నిజాలు
పోస్టాఫీస్ లో కట్టిన సొమ్మంతా పోస్టుమాస్టర్ కాజేశాడు. ఏకంగా రూ.10 కోట్లకు పైగా జనాల సొమ్మును నొక్కేశాడు
ప్రజల సొమ్ము కాజేసి.. ఇష్టారాజ్యంగా జల్సాలు చేయడం.. చేసిన మోసాలు బయటపడగానే పరారవ్వడం.. ఈ రోజుల్లో బాగా కామన్ అయిపోయింది. ఏదో చిట్టీలు వేసో, అప్పులిచ్చో మోసపోలేదు వీళ్లు. పోస్టాఫీస్ బ్రాంచ్ లో కట్టిన సొమ్మంతా పోస్టుమాస్టర్ నొక్కేశాడు. రూ.10 వేలు, రూ.20 వేలు కాదు.. ఏకంగా రూ.10 కోట్లకు పైగా జనాల సొమ్మును నొక్కేశాడు ఆ పోస్టుమాస్టర్. అతని మరణంతో ఈ దారుణమైన మోసం బయటపడింది. వివరాల్లోకి వెళితే ఆముదాలవలస మండలం తోటాడ బ్రాంచ్ లో జరిగిందీ ఘటన. స్థానికంగా ఈ బడా మోసం కలకలం రేపింది.
ఐదు గ్రామాల ప్రజలకు...
శ్రీకాకుళం జిల్లా తోటాడ పోస్టాఫీస్ లో ఐదు గ్రామాల ప్రజలకు ఖాతాలున్నాయి. గోపీనగర్, అక్కివలస, మాసయ్యపేట, కొత్తరోడ్డు, తోటాడ గ్రామస్తులు తమకష్టంతో సంపాదించుకున్న డబ్బుతో ఈ బ్రాంచ్ లోనే ఫిక్స్డ్ డిపాజిట్లు, నెలవారీ డిపాజిట్లు కట్టుకున్నారు. ఇలా డిపాజిట్లు కట్టుకుంటూ.. ఆ సొమ్ము ఒకేసారి తీసుకుంటే.. ఏదొక ఇంటి అవసరాలకు ఉపయోగపడుతుందని గంపెడు ఆశలతో ఉన్న ఖాతాదారులకు పెద్ద షాక్ తగిలింది. ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 2 వేల మంది ఖాతాదారులు కట్టే సొమ్మును ఆ బ్రాంచ్ పోస్టుమాస్టర్ శశిభూషణరావు తన కుటుంబ జల్సాలకు ఖర్చు చేశాడు. అతని మరణంతో ఈ విషయం బయటికి వచ్చింది. దాంతో శశిభూషణరావు కుటుంబం ఊర్లోనుంచి పరారయింది.
మరణంతో...
పోస్టుమాస్టర్ శశిభూషణరావు మృతితో.. ఖాతాదారులు తమ లావాదేవీల గురించి తెలుసుకునేందుకు పోస్టాఫీస్ కు వెళ్లారు. తమ పోస్ట్ ఆఫీస్ బుక్ లో ఉన్న లావాదేవీలు ఆన్లైన్లో పొందుపరచక పోవడంతో ఖాతాదారులు అనుమానం వ్యక్తం చేశారు. వెంటనే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో.. అధికారులు విచారణ చేపట్టారు. ఇక్కడే బిత్తరపోయే నిజాలు వెలుగుచూశాయి. అనంతరం పోస్టల్ అధికారులు, పోలీసులను ఆశ్రయించగా.. ఫిర్యాదు నమోదు చేసుకున్న పోలీసులు తోటాడ పోస్టాఫీస్ లో తనిఖీలు నిర్వహించారు. అలాగే రాగోలు గ్రామంలో ఉన్న శశిభూషణరావు ఇంట్లోనూ సోదాలు చేశారు. మొత్తంమీద రూ.10 కోట్లు కాజేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. దీంతో బాధితులు లబోదిబోమంటున్నారు. తినీ తినక.. రూపాయి రూపాయి కూడబెట్టి పోస్టాఫీస్ లో కడితే.. ఆఖరికి నమ్మించి మా గొంతులు కోసారని వాపోతున్నారు. పోస్టల్ శాఖ ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని తమకు న్యాయం చేయాలని ఖాతాదారులు కోరుతున్నారు.
Next Story