Tue Dec 24 2024 12:47:01 GMT+0000 (Coordinated Universal Time)
రాజేష్ మృతి కేసు : అసలు జరిగింది ఇదేనన్న పోలీసులు
ములుగు జిల్లా పంచోత్కులపల్లికి చెందిన ఎల్లావులా పరశురాములు, విజయ దంపతుల కుమారుడైన రాజేష్ (25) కుంట్లూర్ డాక్టర్స్ కాలనీ
హయత్ నగర్ లో మే 29వ తేదీన కుళ్లిపోయిన స్థితిలో రాజేష్ (25) అనే యువకుడి మృతదేహం లభ్యమైన సంగతి తెలిసిందే. అతనిది హత్యా ? లేక ఆత్మహత్య? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేయగా.. ఓ ఉపాధ్యాయురాలితో ఉన్న సంబంధం బయటపడింది. అప్పటికే ఆమె కూడా చనిపోవడంతో.. రెండుకేసుల దర్యాప్తును వేగవంతం చేశారు. ఆ ఇద్దరి మరణాల వెనుక ఉన్న కారణాలను వెల్లడించారు. రాజేష్, ఉపాధ్యాయురాలు (45) కలిసే బలవన్మరణానికి పాల్పడినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.
ములుగు జిల్లా పంచోత్కులపల్లికి చెందిన ఎల్లావులా పరశురాములు, విజయ దంపతుల కుమారుడైన రాజేష్ (25) కుంట్లూర్ డాక్టర్స్ కాలనీలో ఆత్మహత్యకు పాల్పడ్డాడని పోలీసులు నిర్థారించారు. ప్రేమించిన టీచర్ తనను నమ్మించి, పెళ్లికాలేదని మోసం చేయడాన్ని భరించలేక రాజేష్ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. హయత్ నగర్ కు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయురాలికి భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆరు నెలల క్రితం ఓ మిస్డ్ కాల్ ద్వారా ఆమెకు రాజేష్ తో పరిచయం ఏర్పడింది. ఆమె వాట్సాప్ అకౌంట్ కి ఉన్న ఫొటో చూసి రాజేష్ ప్రేమలో పడ్డాడు. ఇదే విషయాన్ని ఆమెకు చెప్పాడు.
రాజేష్ తనకు కూడా నచ్చడంతో.. ఓకే చెప్పింది. ఆ తర్వాత ఇద్దరూ కలిసి హైదరాబాద్, నల్గొండ ప్రాంతాల్లో చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. టీచర్ ను పెళ్లి చేసుకోవాలని భావించిన రాజేష్ కు.. ఆమెకు పెళ్లై భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నట్లు తెలియడంతో ఆమెను దూరం పెట్టాడు. అటు కుటుంబాన్ని వదులుకోలేక, ఇటు రాజేష్ దూరం పెట్టడాన్ని తట్టుకోలేక ఓ రోజు మాట్లాడుకుందాం రమ్మని చెప్పడంతో ఇద్దరూ కలుసుకున్నారు. తామిద్దరం కలిసి జీవించలేమని భావించిన టీచర్, రాజేష్ లు కలిసి చనిపోవాలని నిర్ణయించుకున్నారు.
మే 24వ తేదీన ఇద్దరూ కలిసి ఓ ఫెర్టిలైజర్ దుకాణంలో పురుగులమందు కొనుగోలు చేశారు. ఇద్దరూ కలిసి చనిపోదామని శివారు ప్రాంతానికి వెళ్లాలనుకున్నారు. ఆఖరిసారి తన పిల్లల్ని చూసి వస్తానని టీచర్ హయత్ నగర్ లోని తన ఇంటికి వెళ్లింది. కాసేపు కూతురు, కొడుకుతో గడిపి వెంటతెచ్చుకున్న పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేయగా.. కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. అదేరోజు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. తిరిగివస్తానని ఇంటికి వెళ్లిన టీచర్ ఎంతకీ రాకపోవటంతో రాజేశ్ ఆమె వాట్సాప్ కు వరుసగా మెసేజ్ లు పంపాడు. ఫోన్ కాల్స్ చేశాడు. అవన్నీ చూసిన టీచర్ కూతురు వాటిని తన తమ్ముడికి చూపింది. రాజేశ్ ఉన్న ప్రాంతానికి వెళ్లి మందలించాడు. తాను ప్రేమించిన టీచర్ మృతి చెందిందన్న విషయం తెలుసుకున్న రాజేశ్.. వెంట తెచ్చుకున్న పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పురుగుల మందు తాగిన తర్వాత శరీరం మంటగా అనిపించడంతో అతను దుస్తులు తీసేసి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు.
Next Story