Mon Dec 23 2024 08:56:11 GMT+0000 (Coordinated Universal Time)
బాసర ఆర్జీయూకేటీలో మరో విద్యార్థిని మృతి
రెండురోజుల క్రితమే పీయూసీ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని కాలేజీ బాత్రూమ్ లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోగా..
బాసర ట్రిపుల్ ఐటీలో వరుసగా విద్యార్థుల ఆత్మహత్యలు కలకలం రేపుతున్నాయి. విద్యార్థులే ఆత్మహత్యలు చేసుకుంటున్నారా ? లేక కాలేజీలో ఇంకా ఏమైనా జరుగుతుందా ? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. రెండురోజుల క్రితమే పీయూసీ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని కాలేజీ బాత్రూమ్ లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోగా.. తాజాగా గురువారం వేకువజామున 2 గంటల సమయంలో పీయూసీ ఫస్ట్ ఇయర్ చదువుతున్న మరో విద్యార్థిని లిఖిత (17) అనే విద్యార్థిని హాస్టల్ 4వ అంతస్తు నుంచి కిందపడింది.
తీవ్రగాయాలు అయిన లిఖితను ప్రథమ చికిత్స అనంతరం భైంసా ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం నిర్మల్ ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే లిఖిత మరణించినట్లు ధృవీకరించారు వైద్యులు. అయితే లిఖితది ఆత్మహత్యేనా లేక ప్రమాదవశాత్తు జరిగిందా ? ఇంకేదైనా కోణం ఉందా ? అన్న దానిపై స్పష్టత రావాల్సి ఉంది. లిఖిత నోటి వెంట నురగలు ఉండటంతో ఆమె విషం తాగి ఉండొచ్చని వైద్యులు అనుమానం వ్యక్తం చేశారు. పోస్టుమార్టమ్ అనంతరం అన్ని వెల్లడిస్తామన్నారు.
ట్రిపుల్ ఐటీ అధికారులు మాత్రం లిఖిత ప్రమాదవశాత్తు పడిపోయినట్లు చెబుతున్నారు. లిఖిత స్వస్థలం సిద్ధిపేట జిల్లా గజ్వేల్. బుర్రరాజు - రేణుక దంపతుల పెద్దకుమార్తె అయిన లిఖిత వారంరోజుల క్రితమే హాస్టల్ కు వచ్చింది. ఇంతలోనే ఇలా జరగడంతో తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమవుతున్నారు.
Next Story