Mon Dec 23 2024 14:28:52 GMT+0000 (Coordinated Universal Time)
కండల మత్తులో.. హైదరాబాద్ లో డేంజర్ ఇంజెక్షన్స్
వైద్యుల ప్రిస్కిప్షన్ లేకుండా స్టెరాయిడ్స్గా ఉపయోగించే అనేస్తటిక్, హార్మోన్స్ ఇంజక్షన్స్ను ఎక్కువ ధరకు అమ్ముతున్న..
నేటి జనరేషన్ లో ఊబకాయంతో బాధపడేవారెంత మంది ఉన్నారో.. బాడీ ఫిట్ గా ఉండాలని, కండలు పెరగాలని జిమ్ ల చుట్టూ తిరిగే వారు కూడా అదే స్థాయిలో ఉన్నారు. ముఖ్యంగా యువత సిక్స్ ప్యాక్, 8 ప్యాక్ ల కోసం జిమ్ ల బాటపడుతోంది. జిమ్ చేయడం ఆరోగ్యానికి మంచిదే.. కానీ అందుకు మంచి ట్రైనర్ కూడా ఉండాలి. ట్రైనర్ లేకుండా జిమ్ లో ఇష్టానుసారం వ్యాయామాలు చేస్తే.. మొదటికే మోసం వస్తుంది. ఇక అసలు విషయానికొస్తే.. ఎలాగైనా కండల పెరగాలన్న మోజులో ఉన్నవారినే టార్గెట్ చేసి.. ఏకంగా స్టెరాయిడ్స్ వాడేస్తున్నారు.
హైదరాబాద్ లోని కొన్ని జిమ్ లలో యువత కండల పెరుగుదలకై స్టెరాయిడ్స్ వాడుతున్నట్లు తెలుస్తోంది. ఆరోగ్యం కన్నా హీ మ్యాన్లా కన్పించాలనే యావ..యువతను స్టెరాయిడ్స్ వైపు మళ్లిస్తోంది. ఫలితంగా గుండెపోటును కొనితెచ్చుకుంటున్నారు. సల్మాన్ ఖాన్ మాదిరి కండలవీరులుగా కనిపించాలన్న యావతో ఉన్నవారే టార్గెట్ గా డ్రగ్ మాఫియా డేంజర్ ఇంజెక్షన్ల పంజా విసురుతోంది. డ్రగ్స్ దందాపై నగర పోలీసులు ఉక్కుపాదం మోపితే.. ఇప్పుడు స్టెరాయిడ్ రాకెట్ కు తెరలేపారు. ఈ విషయం పోలీసుల దృష్టికి వెళ్లడంతో.. వాటికీ చెక్ పెట్టారు.
వైద్యుల ప్రిస్కిప్షన్ లేకుండా స్టెరాయిడ్స్గా ఉపయోగించే అనేస్తటిక్, హార్మోన్స్ ఇంజక్షన్స్ను ఎక్కువ ధరకు అమ్ముతున్న హయత్నగర్లోని శ్రీనివాస ఆస్పత్రి కాంపౌండర్ బాలాజీ ధర్మాజీ, మ్యాక్సిక్యూర్ ఆస్పత్రి సిబ్బంది ప్రసాద్ గులాబ్రావ్ని పక్కా సమాచారంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుండి 30 స్టెరాయిడ్ ఇంజెక్షన్స్, 2 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నాందేడ్ కు చెందిన వీరిద్దరూ కొన్నేళ్లుగా ఎల్బీనగర్, హయత్నగర్ సహా ఇతర ప్రాంతాల్లో డ్రగ్స్ అలవాటు ఉన్నవారిని టార్గెట్ చేసి ఇంజెక్షన్లను అమ్ముతున్నట్లు వనస్థలిపురం ఏసీపీ పురుషోత్తం రెడ్డి వెల్లడించారు. 268 రూపాయల ధర ఉన్న ఈ ఇంజక్షన్లను డాక్టర్ ప్రిస్కిప్షన్ లేకుండా వెయ్యి నుంచి 2 వేల రూపాయలకి అమ్ముతున్నట్లు పోలీసులు విచారణలో వెల్లడైంది. ఐతే పట్టుబడ్డ బాలాజీ, ప్రసాద్ గులాబీరావుల వెనుక ఏదైనా ఆస్పత్రి యాజమాన్యం హస్తం ఉందా అనే కోణంలో విచారణ చేస్తున్నారు.
Next Story