Mon Dec 23 2024 15:00:25 GMT+0000 (Coordinated Universal Time)
డ్రైవర్ నిర్లక్ష్యం.. రెండేళ్ల చిన్నారి మృతి
మన్సూరాబాద్-ఎల్బీనగర్ మార్గంలో రోడ్డుపై కారు ఆపిన డ్రైవర్ హఠాత్తుగా డోర్ ఓపెన్ చేశాడు. అదే సమయంలో ..
హైదరాబాద్ ఎల్బీ నగర్ లో విషాద ఘటన చోటుచేసుకుంది. ఓ కారు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా రెండేళ్ల చిన్నారి ప్రాణం పోయింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మన్సూరాబాద్-ఎల్బీనగర్ మార్గంలో రోడ్డుపై కారు ఆపిన డ్రైవర్ హఠాత్తుగా డోర్ ఓపెన్ చేశాడు. అదే సమయంలో ఆ పక్కనుండి వెళ్తున్న బైక్ కు కారు డోర్ తగిలింది. దాంతో బైక్ పై ఉన్న దంపతులు సహా రెండేళ్ల చిన్నారి కిందపడిపోయారు. ఈ ప్రమాదంలో చిన్నారి ధనలక్ష్మి (2) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. తల్లికి తీవ్రగాయాలయ్యాయి. తండ్రికి స్వల్పగాయాలయ్యాయి. చిన్నారి తల్లిదండ్రులు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఈ ప్రమాదం తాలుకా దృశ్యాలు ఆ రోడ్ లో ఉన్న సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. కారు డ్రైవర్ నిర్లక్ష్యంగా రోడ్డుపై కారు ఆపడమే కాకుండా.. వెనుక వచ్చే వాహనాన్ని గమనించకుండా డోర్ తీయడమే ప్రమాదానికి ప్రధాన కారణంగా గుర్తించారు పోలీసులు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని కారు డ్రైవర్ ను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. మరోవైపు చిన్నారి ధనలక్ష్మి మృతితో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అల్లారుముద్దుగా పెంచుకుంటున్న ఆ పాప ఇక లేదని తెలిసి బంధువులు రోధిస్తున్నారు. చిన్నారి తల్లిపరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
Next Story