Thu Dec 26 2024 22:51:14 GMT+0000 (Coordinated Universal Time)
ఘోర రోడ్డుప్రమాదం.. నలుగురు మృతి
విజయవాడ నుండి హిందూపురం వెళ్తున్న ఆర్టీసీ బస్సు వినుకొండ వైపు వెళ్తున్న కారును ఢీ కొట్టింది. ప్రమాదంలో కారులో..
ఏపీలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ఏపీ ఆర్టీసీ బస్సు - కారు ఢీ కొన్న ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మరణించారు. ప్రకాశం జిల్లా త్రిపురాంతకం సమీపంలో ఆదివారం రాత్రి ఈ ప్రమాదం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. విజయవాడ నుండి హిందూపురం వెళ్తున్న ఆర్టీసీ బస్సు వినుకొండ వైపు వెళ్తున్న కారును ఢీ కొట్టింది. ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న వారిలో ముగ్గురు అక్కడే మరణించారు. తీవ్రంగా గాయపడిన మరొక వ్యక్తిని ఆసుపత్రికి తరలిస్తుండగా అతను కూడా మృతి చెందాడు. ప్రమాదానికి గురైన కారు నుజ్జునుజ్జయింది.
ఈ ప్రమాదంలో మరణించిన వారంతా విజయవాడకు చెందినవారుగా గుర్తించారు. మృతులు సాయి, పిల్లి శ్రీనివాస్, చంద్రశేఖర్, శంకర్ లుగా గుర్తించారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడగా.. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతులు, క్షతగాత్రులంతా అనంతపురంలో ఒక పెళ్లివేడుకకు అలంకరణ పనులకోసం వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మితిమీరిన వేగమే ప్రమాదానికి కారణంగా భావిస్తున్నారు.
Next Story