Mon Dec 23 2024 15:15:50 GMT+0000 (Coordinated Universal Time)
మహేష్ ఫ్యామిలీ ప్రమోట్ చేసిన.. రియల్ ఎస్టేట్ కంపెనీపై చీటింగ్ కేసు
ఏప్రిల్ 2021లో షాద్ నగర్లో 14 ఎకరాల భూమి పై పెట్టుబడి పెట్టినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ వెంచర్ లో నక్క విష్ణువర్థన్..
సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యామిలీ మొత్తం కలిసి ప్రమోట్ చేసిన ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీ సాయిసూర్య డెవలపర్స్ పై చీటింగ్ కేసు నమోదైంది. హైదరాబాద్ లోని వెంగళ్రావు నగర్ కేంద్రంగా నడుస్తున్న ఈ కంపెనీ యజమాని కంచర్ల సతీష్ చంద్ర గుప్తపై 32 ఏళ్ల సాఫ్ట్ వేర్ ఇంజినీర్ చీటింగ్ కేసు నమోదు చేశారు. మధురానగర్ పీఎస్ లో అతను ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. నక్క విష్ణువర్థన్ అనే వ్యక్తి తన సన్నిహితులైన కొందరు వ్యక్తులతో కలిసి సాయిసూర్య డెవలపర్స్ గ్రీన్ మెడోస్ వెంచర్ లో రూ.3.21 కోట్ల 34 వేలు పెట్టుబడి పెట్టారు.
ఏప్రిల్ 2021లో షాద్ నగర్లో 14 ఎకరాల భూమి పై పెట్టుబడి పెట్టినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ వెంచర్ లో నక్క విష్ణువర్థన్ అండ్ కో తో పాటు డాక్టర్ సుధాకర్ రావు, శ్రీకాకుళం విటల్ మహేష్, రాజేశ్, శ్రీనాథ్, కె.హరీష్, కోట్ల శశాంక్, సిహెచ్ రవి కుమార్, కె.ప్రభావతి, వెంకట్ రావు, కృష్ణ మోహన్ కూడా పెట్టుబడులు పెట్టగా.. ఒప్పందం జరిగింది. హెచ్ఎండీఏ నుంచి అనుమతులు వచ్చాక ప్లాట్ లను రిజిస్టర్ చేస్తామని హామీ ఇవ్వడంతో పెట్టుబడులు పెట్టినట్లు విష్ణువర్థన్ అండ్ కో చెబుతున్నారు. 2022 డిసెంబర్ కే ప్లాట్లను ఇస్తామన్నారని, తీరాచూస్తే ఆ ప్లాట్లు థర్డ్ పార్టీకి సేల్ డీడ్ చేసినట్లు తేలిందన్నారు. SRV & TNR ఇన్ ఫ్రా - రాజారామ్ అండ్ VASGI వెంకటేశ్ అనే ఫైనాన్షియర్ల పేర్ల మీదికి ప్లాట్లు వెళ్లిపోవడంతో కస్టమర్లు ఆందోళన చెంది కంచర్ల సతీష్ పై ఫిర్యాదు చేశారు. మహేష్ బాబు వంటి అగ్రనటులు బ్రాండ్ అంబాసిడర్ గా ఉండటంతో మోసం జరగదనుకున్నామని వాపోతున్నారు. కస్టమర్ల ఫిర్యాదుతో ఐపీసీ సెక్షన్ 406, 420 కింద నిందితులు ఆర్థిక అవకతవకలకు పాల్పడినట్లు కేసులు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.
Next Story