Tue Dec 24 2024 12:22:33 GMT+0000 (Coordinated Universal Time)
హోంవర్క్ చేయలేదని కొట్టిన టీచర్.. చిన్నారి మృతి
ఆ తర్వాత చిన్నారి తలపై స్కేల్ తో కొట్టడంతో.. ఫాతిమా తీవ్ర అస్వస్థతకు గురై స్పృహ కోల్పోయింది. దాంతో వెంటనే..
హోం వర్క్ చేయలేదన్న కారణంతో టీచర్ చిన్నారికి వేసిన శిక్ష.. ఆమె ప్రాణాన్ని హరించింది. తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా వుడ్ బ్రిడ్జ్ స్కూల్లో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికులను కలచివేసింది. అర్సపల్లికి చెందిన ఏడేళ్ల ఫాతిమా జిల్లా కేంద్రంలోని బోధన్ రోడ్డు ఎన్ఆర్ఐ కాలనీలో ఉన్న వుడ్ బ్రిడ్జ్ స్కూల్లో రెండవ తరగతి చదువుతోంది. సెప్టెంబర్ 3న ఫాతిమా హోం వర్క్ చేయకుండా స్కూల్ కి వెళ్లడంతో.. క్లాస్ టీచర్ కోప్పడింది. పనిష్మెంట్ గా గంటపాటు బెంచీపై నిలబెట్టారు. అంతటితో ఆగకుండా స్కూల్ బ్యాగులో పుస్తకాలుఉంచి దానిని బాలిక మెడపై పెట్టి మోయించినట్లు తోటి విద్యార్థులు తెలిపారు.
ఆ తర్వాత చిన్నారి తలపై స్కేల్ తో కొట్టడంతో.. ఫాతిమా తీవ్ర అస్వస్థతకు గురై స్పృహ కోల్పోయింది. దాంతో వెంటనే ఫాతిమాను ఆస్పత్రికి తరలించగా.. తలలో రక్తం గడ్డకట్టినట్లు వైద్యులు తెలిపారు. నాలుగురోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారి ఫాతిమా.. నిన్న మృతి చెందింది. విషయం తెలిసి ఆమె తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఫాతిమా రెండేళ్లుగా బ్రెయిన్ ట్యూమర్ తో బాధపడుతున్నట్లు తల్లిదండ్రులు పేర్కొన్నారు. తమ చిన్నారి మృతికి కారణమైన టీచర్ పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ.. తండ్రి ముజీబ్ ఖాన్ నిజామాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. చిన్నారి మృతితో వుడ్ బ్రిడ్జ్ సంస్థ పాఠశాలను మూసివేసింది.
Next Story