Mon Dec 23 2024 07:10:14 GMT+0000 (Coordinated Universal Time)
రూ. 94 లక్షల పై చిలుకు బంగారం పట్టివేత
కానీ అధికారులకు వారి కదలికలపై అనుమానం కలగడంతో వెంటనే వారిని అదుపులోకి తీసుకొని తమదైన స్టైల్ లో విచారణ..
స్మగ్లర్లు రోజురోజుకీ రెచ్చిపోతున్నారు. వినూత్న రీతిలో ఆలోచించి బంగారాన్ని అక్రమంగా ఎయిర్ పోర్టు నుంచి తరలించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఎయిర్ పోర్టుల్లో తనిఖీల సమయంలో అధికారుల చేతికి ఇట్టే చిక్కుతున్నారు. దేశంలోకి అక్రమంగా తరలిస్తున్న అక్రమ రవాణాను అరికట్టేందుకు హైదరాబాద్ కస్టమ్స్ అధికారులు నిరంతరం కృషి చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అధికారులు ప్యాసింజర్ రూపంలో వచ్చే స్మగ్లర్లపై నిఘా పెడుతున్నారు. గురువారం మలేషియా నుండి హైదరాబాద్ కు వచ్చిన ఇద్దరు ప్రయాణికులు కస్టమ్స్ అధికారులే కాదు ఎవ్వరు కూడా గుర్తుపట్ట లేని విధంగా బంగారాన్ని పేస్ట్ గా మార్చి జీన్స్ ప్యాంట్ లో, లో దుస్తుల్లో దాచిపెట్టి ఎయిర్ పోర్ట్ దాటించే ప్రయత్నం చేశారు.
కానీ అధికారులకు వారి కదలికలపై అనుమానం కలగడంతో వెంటనే వారిని అదుపులోకి తీసుకొని తమదైన స్టైల్ లో విచారణ చేయడంతో అక్రమ బంగారం వ్యవహారం కాస్త బయటపడింది. దీంతో అధికారులు వెంటనే ప్రయాణికులు ఇద్దరినీ అరెస్టు చేసి వారి వద్ద నుండి రూ.94.99 లక్షల విలువచేసే 1545.1 గ్రాముల బంగారం పేస్టును సీజ్ చేశారు. ఇదిలా ఉండగా మరోవైపు దుబాయ్ నుండి హైదరాబాద్ కు వచ్చిన ఇద్దరు ప్రయాణికుల మీద అనుమానం కలగడంతో వారిని అదుపులోకి తీసుకొని వారి బ్యాగులను క్షుణ్ణంగా పరిశీలించడంతో భారీ ఎత్తున సిగరెట్లు కనిపించాయి. దీంతో అధికారులు ఇద్దరు ప్రయాణికుల నుండి రూ.34 లక్షల విలువచేసే 34,800 సిగరెట్లు స్వాధీనం చేసుకున్నారు. నలుగురు ప్రయాణికులను అరెస్టు చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story