Mon Dec 23 2024 08:19:33 GMT+0000 (Coordinated Universal Time)
తెలంగాణలో ఆరుగురు బాలికలు మిస్సింగ్.. ఇంకా దొరకని ఆచూకీ
అటు ఉమ్మడి వరంగల్ జిల్లా వర్థన్నపేటలో మరో ముగ్గురు బాలికలు అదృశ్యమయ్యారు. ప్రభుత్వ గిరిజన పాఠశాలలో..
తెలంగాణలో నిన్న రాత్రి ఆరుగురు బాలికలు అదృశ్యమయ్యారు. సికింద్రాబాద్ పరిధిలో ముగ్గురు, ఉమ్మడి వరంగల్ జిల్లా వర్థన్నపేటలో మరో ముగ్గురు బాలికలు కనిపించకుండా పోయారు. ఈ రెండు ఘటనలు రాష్ట్రంలో కలకలం రేపాయి. పోలీసులు బాలికల మిస్సింగ్ పై కేసులు నమోదు చేసి.. ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. వివరాల్లోకి వెళితే..
తిరుమలగిరికి చెందిన పరిమలా అనే బాలిక 9వ తరగతి చదువుతోంది. నిన్న(ఫిబ్రవరి 21) ఆమె పుట్టినరోజు. తన స్నేహితులైన హసీనా, స్వప్నతో కలిసి పుట్టినరోజు వేడుకలను జరుపుకోవాలనుకుంది. ఈ విషయం ఇంట్లో చెప్పి.. తన స్నేహితుల వద్దకు వెళ్లింది. ముగ్గురూ కలిసి ఇళ్ల నుండి వెళ్లారు. నిన్న ఉదయం వెళ్లిన బాలికలు.. సాయంత్రం వరకూ ఇంటికి చేరుకోలేదు. కంగారుపడిన పరిమల తల్లిదండ్రులు.. మిగతా ఇద్దరు బాలికల తల్లిదండ్రులను ఆరా తీశారు. వాళ్లిద్దరు కూడా ఇంటికి రాలేదని తెలియడంతో.. ముగ్గురు బాలికల తల్లిదండ్రులు బాలికలకు ఫోన్లు చేశారు. ముగ్గురి ఫోన్లు స్విచ్ఛాఫ్ వచ్చాయి. తెలిసిన వారిని అడిగినా ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలియరాలేదు. ఈ క్రమంలో బాలికల మిస్సింగ్ పై తల్లిదండ్రులు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. బాలికల ఆచూకీ కోసం వెతుకుతున్నారు.
అటు ఉమ్మడి వరంగల్ జిల్లా వర్థన్నపేటలో మరో ముగ్గురు బాలికలు అదృశ్యమయ్యారు. ప్రభుత్వ గిరిజన పాఠశాలలో చదువుతూ.. వసతిగృహంలో ఉంటోన్న 8వ తరగతి విద్యార్థిని సోమవారం రాత్రి సెల్ఫోన్లో మాట్లాడింది. ఈ విషయాన్ని తోటివిద్యార్థులు గమనించి వార్డెన్ కు చెప్పగా.. అతను మొబైల్ లాక్కొని ఇంటికి వెళ్లిపోయాడు. మంగళవారం ఉదయం టిఫిన్ చేస్తున్న సమయంలో 8వ తరగతి విద్యార్థినులు ఇద్దరు, 9వ తరగతి విద్యార్థిని కనిపించలేదు. వెంటనే వారి గదుల్లో ఉండే తోటి విద్యార్థులను విచారించగా.. మంగళవారం ఉదయమే బయటకు వెళ్లినట్లు తెలిపారు.
ముగ్గురు విద్యార్థినుల తల్లిదండ్రులకు సమాచారమివ్వగా.. వారంతా హాస్టల్ కు చేరుకున్నారు. బంధువులు, స్నేహితుల ళ్లకు ఫోన్లు చేయగా.. ఎక్కడా ఆచూకీ తెలియలేదు. దాంతో వార్డెన్ స్వరూప పోలీసులకు మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చారు. తెలంగాణలో మొత్తం ఆరుగురు బాలికల మిస్సింగ్ పై ఆందోళన వ్యక్తమవుతోంది. బాలికల ఆచూకీల కోసం సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తూ.. గాలింపు చర్యలు ముమ్మరం చేశారు పోలీసులు.
Next Story