Mon Dec 23 2024 11:58:59 GMT+0000 (Coordinated Universal Time)
మితిమీరిన ఆన్లైన్ ప్రేమ వ్యవహారం.. మెడికో ప్రాణం తీసిన టెక్కీ..వివరాలిలా
పరిచయం స్నేహంగా, స్నేహం ప్రేమగా మారి.. ఇద్దరూ సహజీవనం చేసేవరకూ వెళ్లింది. రెండేళ్లపాటు గన్నవరంలో కలిసున్న వీరిమధ్య..
సోషల్ మీడియా.. ఇది మంచి కన్నా చెడు విషయాలపైనే ఎక్కువ ప్రభావితమయ్యేలా చేస్తోంది. ఇటీవల కాలంలో జరుగుతున్న దారుణాలు ఇందుకు అద్దం పడుతున్నాయి. తాజాగా గుంటూరులో ఓ టెక్కీ.. తనను పెళ్లిచేసుకునేందుకు నిరాకరించిందన్న కోపంలో తన మెడికో ప్రేయసిని సర్జికల్ బ్లేడ్ తో గొంతుకోసి హతమార్చాడు. ఈ ఘటన జిల్లా వ్యాప్తంగా కలకలం రేపుతోంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కృష్ణా జిల్లా పమిడిముక్కల మండలం కృష్ణాపురానికి చెందిన తపస్వికి, అదే జిల్లా ఉంగుటూరు మండలం మానికొండకు చెందిన జ్ఞానేశ్వర్తో ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయం ఏర్పడింది. తపస్వి విజయవాడ సిద్ధార్థ మెడికల్ కాలేజీలో బీడీఎస్ మూడో సంవత్సరం చదువుతోంది.
పరిచయం స్నేహంగా, స్నేహం ప్రేమగా మారి.. ఇద్దరూ సహజీవనం చేసేవరకూ వెళ్లింది. కొద్ది నెలలు గన్నవరంలో కలిసున్న వీరిమధ్య గొడవలు మొదలయ్యాయి. నాలుగు నెలల క్రితం విభేదాలు పెరగడంతో తపస్వి అతడికి దూరంగా ఉంటోంది. ఈ క్రమంలో తపస్వికి మరో వ్యక్తితో పెళ్లి నిశ్చయమైంది. తననే పెళ్లిచేసుకోవాలని జ్ఞానేశ్వర్ ఆమెను వేధించడం మొదలుపెట్టాడు. అతని సైకో వేధింపులు భరించలేక ఓసారి విజయవాడ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది. అయినా వేధింపులు ఆగలేదు. దాంతో పెదకాకాని మండలం తక్కెళ్లపాడులో ఉంటున్న తన స్నేహితురాలికి తన గోడును మొరపెట్టుకుంది. ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చేందుకు ఆ స్నేహితురాలు ఇద్దరినీ తన ఇంటికి రమ్మని పిలిచింది.
నిన్న(డిసెంబర్ 5)రాత్రి 9 గంటల సమయంలో ముగ్గురూ కూర్చుని మాట్లాడుకుంటుండగా.. జ్ఞానేశ్వర్ తపస్విపై బ్లేడుతో దాడి చేశాడు. దాంతో ఆమె స్నేహితురాలు కేకలు వేస్తూ పరుగుపరుగున కిందికి వచ్చి ఇంటి ఓనర్ ను పైకి తీసుకెళ్లేలోపు.. అతను తలుపులు బిగించి.. తపస్వి గొంతు కోసేశాడు. ఇరుగు పొరుగు వచ్చి తలుపులు బద్దలు కొట్టి చూసేసరికి తపస్వి రక్తపు మడుగులో కొనఊపిరితో కొట్టుమిట్టాడుతోంది. నిందితుడిని బంధించి పోలీసులకు సమాచారమిచ్చారు. తపస్విని ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే ఆమె మరణించిందని వైద్యులు తెలిపారు.
ముగ్గురూ మాట్లాడుకుంటుండగా.. తాను వేరే వ్యక్తికి పెళ్లిచేసుకోనున్నట్లు తపస్వి చెప్పడమే ఈ దారుణానికి కారణంగా తెలుస్తోంది. పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి.. ముంబై లో ఉన్న తపస్వి తల్లిదండ్రులకు సమాచారమిచ్చారు. తపస్వి గొంతుకోసిన అనంతరం జ్ఞానేశ్వర్ తన చేతిని బ్లేడుతో కోసుకుని ఆత్మహత్యాయత్నం చేసినట్లు తెలుస్తోంది. ఏదేమైనా మెడికో హత్య రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది.
Next Story