Mon Dec 23 2024 16:27:43 GMT+0000 (Coordinated Universal Time)
తల్లి మృతదేహాన్ని ఇంట్లో దాచిన యువకుడు.. కారణమిదే !
ఇంట్లో ఏదో దుర్వాసన రావడాన్ని గమనించింది ఆ అమ్మాయి. వెంటనే మురుగన్ ఆమెను బయటికి పంపేశాడు. దాంతో ఆ అమ్మాయి ఇరుగు పొరుగు వారికి విషయం చెప్పగా..
కొద్దినెలల క్రితమే ఖననం చేసిన తన తల్లి మృతదేహాన్ని.. స్మశానం నుంచి తీసుకొచ్చి ఇంటిలో దాచాడు ఓ యువకుడు. ఆఖరికి బంధువుల అమ్మాయి ఈ విషయాన్ని గుర్తించి.. ఇరుగు పొరుగు వారికి చెప్పడంతో పోలీసులు ఆ మృతదేహాన్ని తీసుకెళ్లి దహనం చేశారు. ఈ ఘటన తమిళనాడులోని పెరంబలూరు జిల్లా పరవాయి గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బాల మురుగన్ (38) అనే వ్యక్తి చిన్నవయసులోనే తండ్రిని కోల్పోయాడు. దీంతో తల్లే.. అన్నీ తానై పెంచి పెద్ద చేసింది. కానీ.. దురదృష్టవశాత్తు మురుగన్ మతి స్థిమితం సరిగ్గా లేదు.
తండ్రి లేకపోవడంతో..
పెంచి పెద్దచేసి.. కంటికి రెప్పలా చూసుకునే తల్లి కూడా 11 నెలల క్రితం కాలం చేసింది. దాంతో మురుగన్ ఒంటరి వాడయ్యాడు. తల్లిని ఖననం చేసిన స్మశానానికి పదే పదే వెళ్తుండేవాడు. వర్షం పడితే తల్లి సమాధిపై కవర్లు కప్పేవాడు. చాలా రోజులు తల్లిని ఖననం చేసిన చోటే నిద్రించాడు. తల్లి చాటు బిడ్డగా పెరిగిన మురుగన్.. తల్లి లేకపోవడంతో ఒంటరివాడయ్యాడు. తల్లిని మరిచిపోలేక ఓ అర్థరాత్రి ఆమె సమాధిని తవ్వి.. మృతదేహాన్ని తీసుకొచ్చి ఇంటిలో పెట్టుకున్నాడు. తాజాగా బంధువుల అమ్మాయి మురుగన్ ను పలుకరించేందుకు ఇంటికి వెళ్లగా ఈ విషయం బయటపడింది.
బంధువుల అమ్మాయి రాకతో..
ఇంట్లో ఏదో దుర్వాసన రావడాన్ని గమనించింది ఆ అమ్మాయి. వెంటనే మురుగన్ ఆమెను బయటికి పంపేశాడు. దాంతో ఆ అమ్మాయి ఇరుగు పొరుగు వారికి విషయం చెప్పగా.. వారంతా కలిసి మురుగన్ ఇంటికెళ్లి చూశారు. కుళ్లిన స్థితిలో ఉన్న అతని తల్లి మృతదేహాన్ని చూసి షాకయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా.. పోలీసులు ఆ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చాలా రోజుల క్రితం బాలమురుగన్ తన తల్లి సమాధిని తొవ్వి మృతదేహాన్ని చెత్తబండిలో పెట్టుకుని అర్ధరాత్రి సమయంలో ఇంటికి వచ్చినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. మృతదేహాన్ని ఖననం చేస్తే.. మురుగన్ మళ్లీ ఇంటికి తీసుకువస్తాడన్న అనుమానంతో.. ఆ మృతదేహాన్ని దహనం చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
ఏదేమైనా మురుగన్ కు తల్లిపై ఉన్న ప్రేమ వెల కట్టలేనిది. తల్లిదండ్రులను బరువుగా భావించే పిల్లలున్న ఈ రోజుల్లో.. తల్లిలోనే లోకం చూస్తున్న బాల మురుగన్ ఎంతో గొప్పవాడు.
Next Story