Mon Dec 23 2024 09:33:05 GMT+0000 (Coordinated Universal Time)
హైదరాబాద్ లో దారుణం.. తండ్రిని సుత్తితొ కొట్టి చంపిన కొడుకు
ప్రస్తుతం ఆమెతోనే కాపురం ఉంటున్నాడు. మొదటి భార్య, ఆమె పిల్లల బాగోగులను పట్టించుకోవడం లేదు. ఇటీవల టెంట్ హౌస్..
కన్న తండ్రిని కొడుకు సుత్తితో కొట్టి చంపిన దారుణ ఘటన హైదరాబాద్ లోని రామంతాపుర్ లో వెలుగుచూసింది. ఇంటి ఖర్చులకోసం డబ్బులివ్వలేదన్న కోపంతో కొడుకు ఇంతటి దారుణానికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళ్తే.. రామంతాపూర్ వివేక్ నగర్ కి చెందిన పాండు సాగర్ కి 30 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి పవన్, సాయి ప్రశాంత్, యశ్వంత్ అనే ముగ్గురు కొడుకులు ఉన్నారు. పాండు సాగర్ రామంతపూర్ లోనే టెంట్ హౌస్ నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. భార్య భర్తల మధ్య ఏం గొడవలు జరిగాయోగానీ.. పాండు నాలుగేళ్ల క్రితం పీర్జాధిగూడకి చెందిన విజయలక్ష్మి అనే మరో మహిళను రెండో వివాహం చేసుకున్నాడు.
ప్రస్తుతం ఆమెతోనే కాపురం ఉంటున్నాడు. మొదటి భార్య, ఆమె పిల్లల బాగోగులను పట్టించుకోవడం లేదు. ఇటీవల టెంట్ హౌస్ సామాన్లు పెట్టుకునేందుకు శ్రీనివాసపురంలో ఒక అపార్ట్ మెంట్ లో రెంటుకి తీసుకున్నాడు. ఆ అపార్ట్ మెంట్ వద్దకి మొదటి భార్య పెద్ద కొడుకైన పవన్ వెళ్లాడు. ఖర్చులకు డబ్బు కావాలని అడగ్గా.. ఒక్కరూపాయి కూడా ఇచ్చేది లేదని తెగేసి చెప్పాడు. దాంతో ఇద్దరి మధ్యన గొడవ జరిగింది. సంపాదనంతా రెండో భార్యకే పెడుతున్నాడన్న కోపంతో టెంట్ హౌజ్ నుండి తెచ్చిన సుత్తితో పవన్ తండ్రి తలపై బలంగా కొట్టడంతో అతను అక్కడికక్కడే కుప్పకూలిపోయి.. ప్రాణం విడిచాడు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా.. పోలీసులు నిందితుడైన పవన్ ను అదుపులోకి తీసుకున్నారు. పాండు సాగర్ మృతదేహాన్ని పోస్టుమార్టమ్ నిమిత్తం మార్చురీకి తరలించి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నాడు.
Next Story