Mon Dec 23 2024 08:30:56 GMT+0000 (Coordinated Universal Time)
సేవ చేయలేక.. కన్నతల్లిని కడతేర్చిన కొడుకు
ఏళ్ల తరబడి తల్లికి మంచంలో సేవలు చేసి చేసి విసుగుచెందిన బాలయ్య.. ఇంకా ఇలానే చేస్తూ ఉంటే జీవితం ముందుకు సాగదని..
కన్నతల్లి తీవ్ర అనారోగ్యంతో మంచాన పడింది. ఎటూ కదల్లేని పరిస్థితి. 80 ఏళ్ల వయసులో తనపనులు కూడా చేసుకోలేని స్థితిలో ఉన్న ఆ తల్లికి సేవ చేసేందుకు కొడుకు తప్ప మరో దిక్కు లేదు. దాంతో కొడుకు ఆమెకు సేవలు చేయలేక.. ఆ తల్లిని గొంతునులిమి చంపి, గుట్టుచప్పుడు కాకుండా పాతిపెట్టాడు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండల కేంద్రంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. సదాశివనగర్ మండల కేంద్రానికి చెందిన ఇట్ట బోయిన బాలవ్వ(80) కొన్నేళ్లుగా మంచానికే పరిమితమైంది. ఆమెకు మంచంలోనే సర్వం చేసిపెడుతున్నాడు కొడుకు బాలయ్య.
ఏళ్ల తరబడి తల్లికి మంచంలో సేవలు చేసి చేసి విసుగుచెందిన బాలయ్య.. ఇంకా ఇలానే చేస్తూ ఉంటే జీవితం ముందుకు సాగదని భావించి ఏప్రిల్ 13న గొంతు నులిమి చంపాడు. అనంతరం గుట్టు చప్పుడుకాకుండా తల్లి శవాన్ని మండల కేంద్రంలోని బాలాజీ రైస్ మిల్ వెనుక భాగంలోని ఓ ప్రదేశంలో పాతిపెట్టాడు. మరుసటిరోజున ఏమీ ఎరుగనట్టు తన తల్లి కనిపించకుండా పోయిందని సదాశివనగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బాలయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఈ నేపథ్యంలో గ్రామానికి చెందిన స్థానిక ఎంపీటీసీ బీరయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు బాలయ్యను అదుపులోకి తీసుకుని విచారణ చేయగా.. మండల కేంద్రంలోని బాలాజీ రైస్ మిల్ వెనుకభాగంలో తల్లిని గొంతునులిమి పూడ్చిపెట్టినట్టుగా పోలీసుల సమక్షంలో అంగీకరించాడు. పూడ్చిపెట్టిన మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కామారెడ్డి గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్ కు తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సదాశివనగర్ సిఐ రామన్ తెలిపారు.
Next Story