Mon Dec 23 2024 05:05:56 GMT+0000 (Coordinated Universal Time)
డబ్బు కోసం.. తల్లి నివాసానికి నిప్పంటించిన ప్రబుద్ధుడు
బీర్కూర్ మండల కేంద్రానికి చెందిన గవ్వల చంద్రవ్వ - నారాయణ దంపతుల కొడుకు అశోక్. అతని తండ్రి నారాయణ గతంలోనే..
ప్రతిరోజూ సమాజంలో మానవ విలువలు మంటగలుస్తున్నాయి. డబ్బుల కోసం తల్లిదండ్రుల్ని, అక్రమ సంబంధాలకు అడ్డుగా ఉన్నారని పిల్లలు, భర్తలు, భార్యల్ని చంపడం వంటి ఘటనలు ఏదొక ప్రాంతంలో వెలుగుచూస్తూనే ఉన్నాయి. తాజాగా తెలంగాణలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. డబ్బు కోసం తల్లిని చంపాలని ప్లాన్ చేసి, ఆమె నివాసం ఉంటున్న ఇంటికి నిప్పంటించాడు. ఆ సమయంలో ఆమె ఆ ఇంట్లో లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. ఈ ఘటన కామారెడ్డి జిల్లా బీర్కార్ లో జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బీర్కూర్ మండల కేంద్రానికి చెందిన గవ్వల చంద్రవ్వ - నారాయణ దంపతుల కొడుకు అశోక్. అతని తండ్రి నారాయణ గతంలోనే మృతి చెందాడు. అశోక్ హైదరాబాద్ లో ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ.. భార్య, ఇద్దరు పిల్లలతో అక్కడే నివాసం ఉంటున్నాడు. చంద్రవ్వ బీర్కూర్ లోనే ఉంటోంది. చంద్రవ్వ ఉంటోన్న ఇంటి పక్క గదులను అద్దెకు ఇచ్చారు. ఆ అద్దె డబ్బు కోసం అశోక్ ప్రతినిత్యం తల్లిని వేధించేవాడు. తల్లిపేరున ఉన్న ఆస్తిని కాజేయాలన్న కుట్రతో అశోక్ సోమవారం మధ్యాహ్నం బీర్కూర్ వెళ్లాడు.
తన తల్లి ఇంట్లోనే ఉందని భావించిన అశోక్.. ఆ ఇంటిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఇరుగు పొరుగు వారు గమనించారు. తల్లి చంద్రవ్వ అప్పుడే బయటి నుంచి ఇంటివైపు రావడం చూసిన అశోక్ అక్కడి నుండి పరారయ్యాడు. కొడుకు హైదరాబాద్ నుంచి వచ్చినప్పుడల్లా తనను విపరీతంగా కొట్టి, డబ్బుల కోసం వేధిస్తాడని చంద్రవ్వ వాపోయింది. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి, నిందితుడు అశోక్ కోసం గాలిస్తున్నారు.
Next Story