Mon Dec 23 2024 14:36:37 GMT+0000 (Coordinated Universal Time)
హృదయ విదారకం.. తల్లి మృతదేహంతో మూడ్రోజులుగా మాట్లాడుతున్న కొడుకు
కామారెడ్డి జిల్లా లింగంపల్లి గ్రామానికి చెందిన విప్పల రామ్మోహన్, విజయరాణి (50) దంపతులు. వీరికి వెంకటసాయి (25) అనే కొడుకు
మల్కాజ్ గిరి : కన్నతల్లి చనిపోయింది. ఆ విషయం తెలియక పాతికేళ్ల కొడుకు మూడ్రోజులుగా తనలో తాను మాట్లాడుకుంటూ తల్లి మృతదేహం వద్దే కూర్చుండిపోయాడు. మూడ్రోజుల తర్వాత ఆ ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో.. పక్కింటి వారు పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసుల రాకతో విషయం తెలిసి.. నివ్వెరపోయారు స్థానికులు. ఈ ఘటన మల్కాజిగిరిలో జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కామారెడ్డి జిల్లా లింగంపల్లి గ్రామానికి చెందిన విప్పల రామ్మోహన్, విజయరాణి (50) దంపతులు. వీరికి వెంకటసాయి (25) అనే కొడుకు ఉన్నాడు. బీటెక్ పూర్తి చేశాడు. బెంగళూరులో సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా పనిచేసిన రామ్మోహన్ 2015లో కాలంచేశారు. అప్పట్నుంచి విమలాదేవి కొడుకుతో కలిసి మైత్రి నివాస్ రెండో అంతస్తులో ఉన్న తమ సొంత ప్లాట్ లో ఉంటోంది. తండ్రి చనిపోయాక వెంకటసాయి మానసికంగా కుంగిపోయాడు. ఎవరితోనూ కలిసేవాడు కాదు. ఎక్కువ సమయం ఇంట్లోనే ఉండటంతో.. తల్లీ కొడుకుల మధ్య తరచూ గొడవలు జరిగేవని, వెంకటసాయి బిగ్గరగా అరిచేవాడని స్థానికులు తెలిపారు. దాంతో వారిపై కాలనీ సంఘానికి ఫిర్యాదు చేయగా.. తల్లి కూడా ఇరుగు పొరుగు వారితో మాట్లాడటం మానేసిందని చెప్పారు.
శుక్రవారం రాత్రి వారి ఇంటి నుంచి దుర్వాసన రావడంతో పోలీసులకు సమాచారమిచ్చారు స్థానికులు. పోలీసులు ఆ ఇంటివద్దకు చేరుకుని, తలుపు తీయాలని ఎంత అడిగినా లోపలి నుంచి స్పందన లేదు. దాంతో పోలీసులే బలవంతంగా తలుపులు తెరిచి చూడగా.. విజయరాణి మృతదేహం కుళ్లిన స్థితిలో కనిపించింది. పక్క గదిలో వెంకటసాయి బిత్తర చూపులు చూస్తూ తనలో తాను మాట్లాడుకుంటూ కనిపించాడు. మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించి, వెంకటసాయిని పోలీసులు అదపులోకి తీసుకున్నారు. ఇద్దరి వద్ద సెల్ఫోన్లు లేకపోవడంతో విషయం ఎవరికీ తెలియలేదని చెప్పారు పోలీసులు. విజయరాణి పోస్టుమార్టం రిపోర్ట్ వస్తే ఆమె మరణానికి కారణం తెలుస్తుందని ఎస్సై యాదగిరి తెలిపారు.
Next Story