Mon Dec 23 2024 02:02:01 GMT+0000 (Coordinated Universal Time)
హైదరాబాద్ లో తండ్రీకొడుకుల దారుణ హత్య
హైదరాబాద్ నగరంలో జంట హత్యలు చోటు చేసుకున్నాయి. ఉప్పల్ లో గాంధీ బొమ్మ వద్ద తండ్రి కొడుకులు దారుణ హత్యకు గురయ్యారు. ఈ హత్యలు తెల్లవారుజామున జరిగినట్లుగా స్థానికులు చెబుతున్నారు. చనిపోయిన వారిని నరసింహ 78, అతడి కుమారుడు శ్రీనివాస్ గా గుర్తించారు. వీరిద్దరూ బ్రాహ్మణులు. గొడ్డలితో తండ్రిపై దాడి చేస్తుండగా అడ్డువచ్చిన కొడుకుపై కూడా అత్యంత కిరాతకంగా దుండగులు దాడి చేశారు. ఇద్దరినీ అత్యంత పాశవికంగా హత్య చేసి అక్కడి నుండి దుండగులు పారిపోయారు. దుండగులు తనను కూడా కత్తితో బెదిరించారని పనిమనిషి చెబుతోంది.
తెల్లవారుజామున ఐదున్నర గంటల సమీపంలో బ్లూ టీ షర్టు వేసుకున్న వ్యక్తి గాంధీ బొమ్మ నుంచి మెయిన్ రోడ్డు వైపు పారిపోయినట్లు స్థానికులు తెలిపారు. ఈ హత్యలకు ఒకరే కారణమా.. లేక ఇంకొంత మంది ఉన్నారా అని కూడా ఆరా తీస్తున్నారు. సమాచారం అందుకున్న వెంటనే హుటాహుటిన ఘటనాస్థలికి ఉప్పల్ పోలీసులు చేరుకున్నారు. వెంటనే టీములుగా విడిపోయి పలు కాలనీలు, చుట్టుప్రక్కల పోలీసులు గాలింపు మొదలుపెట్టారు. హతులిద్దరు అత్యంత సౌమ్యులని, మంచి స్నేహపూర్వక సంబంధాలు ఉండేవని చెబుతున్నారు. హత్యకు గల కారణాలను సేకరించే పనిలో నిమగ్నమైన క్లూస్ టీమ్ నిమగ్నమైంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.
మరో కోణం:
పాత కక్షలతో ఈ హత్య జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. భూవివాదంలో గతంలో కూడా ఈ విధమైన దాడి జరిగిందని బంధువులు ఆరోపిస్తున్నారు. శ్రీనివాస్ మలేషియాలో సాఫ్ట్వేర్ ఉద్యోగి.. ఇటీవలే హైదరాబాద్ వచ్చారు.
Next Story