Mon Dec 23 2024 15:16:33 GMT+0000 (Coordinated Universal Time)
బ్రిడ్జి పై నుంచి రైల్వే ట్రాక్ పై పడిన కారు
నాగపుర్ - ఇంగన్ ఘాట్ మార్గంలోని బోర్ ఖేడి సమీపంలో 796/16 పాయింట్ వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మొత్తం నాలుగు ట్రాక్ లు..
మహారాష్ట్రలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. బ్రిడ్జి పై నుంచి వెళ్తున్న కారు అదుపు తప్పి రైల్వే ట్రాక్ పై పడింది. 44 వ జాతీయ రహదారిపై వెళ్తున్న కారు అదుపు తప్పి రైల్వే ఓవర్ బ్రిడ్జి పై నుంచి రైల్వే ట్రాక్ పై పడింది. నాగపుర్ - ఇంగన్ ఘాట్ మార్గంలోని బోర్ ఖేడి సమీపంలో 796/16 పాయింట్ వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మొత్తం నాలుగు ట్రాక్ లు ఉండగా.. 3-4 ట్రాక్ ల మధ్య కారు పడింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఐదుగురు ప్రయాణికులకు తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు ఆసుపత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు.
ప్రమాదానికి గురైన కారు టీఎస్ 13 సిరీస్ తో రిజిస్టరై ఉండటంతో.. అది హైదరాబాద్ కు చెందినదిగా గుర్తించారు. హైదరాబాద్ నుంచి నాగపూర్ వెెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు పోలీసులు. గాయపడినవారు హైదరాబాద్ కు చెందిన వారుగా తెలుస్తోంది. స్థానికుల సమాచారంతో అప్రమత్తమైన రైల్వే అధికారులు.. ప్రమాదం జరిగిన మార్గంలో అరగంట సమయం రైళ్ల రాకపోకలను నిలిపివేశారు. కారును పక్కకు తొలగించిన అనంతరం రైళ్ల రాకపోకలను పునరుద్ధరించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story