Tue Dec 24 2024 00:25:01 GMT+0000 (Coordinated Universal Time)
ఇస్లామాబాద్‌లో భారీ పేలుడు.. ఆత్మాహుతి దాడిలో పోలీస్ మృతి
మహిళ, మరో వ్యక్తి ప్రయాణిస్తున్న అనుమానిత క్యాబ్ ను పోలీసులు వెంబడించి ఆపగా.. ఆ ఇద్దరూ కారు నుండి బయటికి..
భారత శత్రు దేశమైన పాకిస్థాన్ లోని ఇస్లామాబాద్ లో భారీ పేలుడు సంభవించింది. శుక్రవారం (డిసెంబర్ 23) ఉదయం అనుమానాస్పదంగా తిరుగుతున్న ఓ వాహనాన్ని పోలీసులు వెంబడించగా.. ఓ ఉగ్రవాది తనను తాను పేల్చుకున్నాడు. ఈ ఘటనలో ఉగ్రవాదితో పాటు పోలీస్ కూడా మరణించాడు. నగరంలోని ఐ-10 సెక్టార్ పరిధిలో రద్దీగా ఉండే ప్రాంతంలో ఈ పేలుడు సంభవించింది. ఆ ప్రాంతంలో ప్రభుత్వ కార్యాలయాలు, విశ్వ విద్యాలయం, ఉన్నతస్థాయి మార్కెట్లు ఉన్నాయి. నిత్యం రద్దీగా ఉండే ఆ ప్రాంతంలో.. పేలుడు సమయానికి పెద్దగా జనం లేకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్లైంది.
ఈ ఘటనపై ఇస్లామాబాద్ డీఐజీ సోహైల్ జాఫర్ మాట్లాడుతూ.. శుక్రవారం ఉదయం 10.15 గంటల సమయంలో ఈ విషాదకర ఘటన జరిగిందన్నారు. మహిళ, మరో వ్యక్తి ప్రయాణిస్తున్న అనుమానిత క్యాబ్ ను పోలీసులు వెంబడించి ఆపగా.. ఆ ఇద్దరూ కారు నుండి బయటికి వచ్చారన్నారు. అనంతరం యువకుడు కారులో వస్తువులు తీసుకొనేందుకు వెళ్లి ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడని డీఐజీ తెలిపారు. ఈ ఘటనలో ఓ పోలీస్ అధికారికి తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించేలోపే ప్రాణాలు కోల్పోయారని పేర్కొన్నారు. మరో ఇద్దరు పోలీసులు సహా.. పలువురికి స్వల్ప గాయాలవ్వగా చికిత్స పొందుతున్నట్లు తెలిపారు.
Next Story