Fri Nov 22 2024 23:49:38 GMT+0000 (Coordinated Universal Time)
నా భర్త పెద్ద సైకో.. అందుకే ఇలా?
భర్త వేధింపులు తట్టుకోలేక స్వాతి అనే సాఫ్ట్ వేర్ ఇంజినీర్ తన పిల్లలను చంపి తాను ఆత్మహత్య చేసుకుంది
" నా హస్బెండ్ సైకో, శాడిస్ట్. ఊరంతా అప్పులు, మా బంగారం అమ్మేశాడు. అతడి అనుమానాలను భరించలేను. మా అక్క చెల్లెళ్లనీ తప్పుగా చూస్తాడు. సాయి నువ్వు చేసింది.. చేస్తోంది ఆలోచించుకో. పిల్లలకి, నాకు ఏం చేశావ్. జత వస్త్రాలు కొన్నావా! చదివిస్తున్నావా! నా పిల్లలకి నేనంటే పిచ్చి. నేను లేందే వాళ్లను ఎవరూ చూస్కోరు. అందుకే తీస్కొని పోతున్నా.." ఇది ఇంట్లో ఉన్న గోడపై మృతురాలు స్వాతి రాసిన ఆత్మహత్య లేఖ. ఊరంతా భర్త చేసిన అప్పులు, అవి తీర్చాలంటూ భార్యను వేధించడం, అనుమానించడం.. పైగా పిల్లల్ని కూడా పట్టించుకోకపోవడం.. ఇవన్నీ భరించలేక తన ఇద్దరు పిల్లలతో కలిసి స్వాతి ఆత్మహత్య చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..
రాజమండ్రికి చెందిన...
ఆంధ్రప్రదేశ్ రాజమండ్రికి చెందిన జగన్నాథం - శారద దంపతులకు ముగ్గురు ఆడపిల్లలు. జగన్నాథం ఉద్యోగ రీత్యా.. భార్య, పిల్లలతో కలిసి ఎప్పుడు హైదరాబాద్ లోని రాజేంద్ర నగర్ ఫోర్టు వ్యూ కాలనీలో స్థిరపడ్డారు. రెండో కుమార్తె స్వాతి కుసుమ (32) ఇంజినీరింగ్ చదివే సమయంలో వెస్ట్ మారేడ్ పల్లికి చెందిన సాయికుమార్ (32)ను ప్రేమించింది. ఇంట్లో వాళ్లు ఒప్పుకోకపోవడంతో ఆమె సోదరే ఆరేళ్ల క్రితం స్వాతి - సాయికుమార్ లకు దగ్గరుండి కులాంతర వివాహం జరిపించింది. పెళ్లయ్యాక ఈ దంపతులు యూసుఫ్ గూడలో కాపురం పెట్టారు. ఇద్దరూ సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు. మంచి జీతం.. ఇంకేముంది జీవితం చాలా ఆనందంగా ఉంటుందని అనుకుంది స్వాతి. కొన్ని నెలలకు స్వాతి గర్భవతి కావడంతో ఆమెను ఉద్యోగం మానిపించేశాడు సాయికుమార్. తన్విక్ (4), శ్రేయ(3) లను చూసుకుంటూ ఇంట్లోనే ఉంటోంది. అత్తవారింట్లో గొడవల కారణంగా స్వాతి పుట్టింటికి సమీపంలో.. అంటే ఫోర్టు వ్యూ కాలనీకి మకాం మార్చారు.
ఇల్లు మారినా...
ఇల్లు మారినా స్వాతి - సాయికుమార్ ల మధ్య గొడవలు ఏ మాత్రం తగ్గలేదు. మరింత ఎక్కువయ్యాయి. తన అప్పులు తీర్చాలంటూ భార్యను వేధించగా.. స్వాతి తల్లి అల్లుడికి రూ.2.50 లక్షల రుణం ఇప్పించింది. కొద్దిరోజులు బాగానే ఉన్నాడు.. కానీ కుటుంబాన్ని పట్టించుకోకపోవడాన్ని స్వాతి తట్టుకోలేకపోయింది. కనీసం పిల్లల బాగోగులైనా చూసుకోకపోవడం మరింత క్షోభకు గురి చేసింది. దాంతో ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్యకు పాల్పడింది. శుక్రవారం రాత్రి డ్యూటీకి వెళ్లిన సాయికుమార్.. శనివారం ఉదయం 5 గంటలకు ఇంటికొచ్చి హాలులోనే నిద్రపోయాడు. సాయంత్రం లేచాక.. స్వాతి, తన్విక్, శ్రేయ అని పిలవగా.. ఎవరూ పలుకలేదు. అనుమానం వచ్చిన అతను బెడ్రూం తలుపును పగులగొట్టి చూడగా.. అప్పటికే ముగ్గురూ విగతజీవులుగా పడి ఉన్నారు.
అల్లుడే హత్య చేశాడంటూ...
వెంటనే పోలీసులకు సమాచారమివ్వగా.. సాయికుమార్ నుంచి వివరాలు సేకరించారు. స్వాతి తల్లి, సోదరి ల వాంగ్మూలం తీసుకున్నారు. సాయి చాలా నిర్లక్ష్య పరుడని, భార్య ఆత్మహత్య చేసుకుంటున్నా పట్టించుకోలేదని స్వాతి సోదరి, పిల్లల్ని అల్లుడే హత్య చేసి ఉంటాడని స్వాతి తల్లి శారద ఆరోపించారు. పైగా అతను మరో మహిళతో సన్నిహితంగా ఉంటున్నాడని, ఆ విషయంపైనే భార్య నిలదీయడంతో ఇద్దరూ తరచూ గొడవలు పడుతుండేవారని తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు.
Next Story