Mon Dec 23 2024 11:38:49 GMT+0000 (Coordinated Universal Time)
పెంచలకోనలో ఎర్రచందనం స్మగ్లింగ్
టాస్క్ ఫోర్స్ ఇన్చార్జి, కర్నూలు రేంజి డీఐజీ సెంథిల్ కుమార్ తెలిపిన వివరాల మేరకు.. శేషాచలం అడవుల నుంచి..
వెంకటగిరి, రాపూరు ప్రాంతాల్లో నిఘా పెంచిన టాస్క్ ఫోర్స్
నెల్లూరు జిల్లా పెంచలకోనలో ఎర్రచందనం స్మగ్లింగ్ జరుగుతుందన్న సమాచారంతో టాస్క్ ఫోర్స్ కూంబింగ్ నిర్వహించారు. ఈ కూంబింగ్ లో ఒక స్మగ్లర్ ను అరెస్ట్ చేసి, 12 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. టాస్క్ ఫోర్స్ ఇన్చార్జి, కర్నూలు రేంజి డీఐజీ సెంథిల్ కుమార్ తెలిపిన వివరాల మేరకు.. శేషాచలం అడవుల నుంచి కొంత మంది ఎర్రచందనం స్మగ్లర్లు రూటు మార్చి వెంకటగిరి, రాపూరు ప్రాంతాల్లోని పెంచలకోన అడవుల్లో మకాం వేసినట్లు సమాచారం అందింది. ఆ ప్రాంతంలో నాణ్యమైన ఎర్రచందనం దుంగలు ఉండటంతో స్మగ్లర్లు అటు వైపుకు వెళుతున్నారని తెలిసింది. ఇప్పటికే 8 టాస్క్ ఫోర్స్ టీమ్ లు ఉండగా.. మరికొందరు టాస్క్ ఫోర్స్ తో కలిసి 10 టీమ్ లతో కూంబింగ్ నిర్వహించారు.
రెండు టీమ్ లను వెంకటగిరి, రాపూరు వైపుకు కేటాయించారు. ప్రతి రోజూ రాపూరు ప్రాంతంలోనూ కూంబింగ్ నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. డీఎస్పీ మురళీధర్ అధ్వర్యంలోని ఆర్ఐ సురేష్ కుమార్ రెడ్డికి చెందిన ఆర్ఎస్ఐ విశ్వనాథ్ టీమ్ రాపూరు రేంజి గోనుపల్లి సెక్షన్ కొత్తూరు పల్లి ఫారెస్టు బీట్ పరిధిలోని పెద్దగట్టు అటవీ ప్రాంతంలో కూంబింగ్ చేపట్టారు. బుధవారం (జులై 5) పెద్దగట్టు వద్ద కొంతమంది ఎర్రచందనం దుంగలను తీసుకు వెళ్తూ కనిపించగా.. వారిని పట్టుకునేందుకు టాస్క్ ఫోర్స్ పోలీసులు వెంబడించారు.
టాస్క్ ఫోర్స్ ను గమనించిన స్మగ్లర్లు దుంగలను వదిలి పరారయ్యారు. వారిలో ఒక స్మగ్లర్ మాత్రం పట్టుబడ్డాడు. అతను తమిళనాడు తిరువన్నామలై జిల్లా జమునామత్తూరు తాలూకా, కోవిలండూరు గ్రామానికి చెందిన మురుగన్ వెల్లయ్యన్ (54)గా గుర్తించారు. 12 ర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. మరో ఆరుగురు తప్పించుకోగా.. వారిని అన్నాదురై, దక్షిణామూర్తి, రేణుసెన్నూరు, కుప్పస్వామి, వేలు సెన్నూరు, అజిత్ లుగా గుర్తించారు. పరారీలో ఉన్న స్మగ్లర్ల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. రాపూరు వైపు నిఘా పెంచాలని డీఐజీ సెంథిల్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు.
Next Story