Fri Nov 22 2024 22:45:00 GMT+0000 (Coordinated Universal Time)
ఏడాది క్రితం పెట్టిన పోస్టుపై కేసు.. టిడిపి నేత ఆత్మహత్య
ఆ సమయంలో వెంకట్రావ్ ఇంట్లో లేకపోవడంతో భార్య కృష్ణవేణికి విషయం చెప్పి.. పోలీస్ స్టేషన్ కు రావాల్సి ఉంటుందని హెచ్చరించి..
శ్రీకాకుళం : ఏడాది క్రితం సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులపై ఇప్పుడు కేసు నమోదు చేయడంతో.. భయాందోళన చెందిన టిడిపి నేత ఆత్మహత్యకు పాల్పడిన ఘటన శ్రీకాకుళం జిల్లాలో జరిగింది. మందస మండలంలోని పొత్తంగి గ్రామానికి చెందిన టిడిపి సోషల్ మీడియా సభ్యుడు కోన వెంకట్రావు (39) గతేడాది పంచాయతీ ఎన్నికల సమయంలో టెక్కలి నియోజకవర్గ వైసీపీ నేతపై అభ్యంతరకర పోస్టు పెట్టారంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు సోమవారం సాయంత్రం టెక్కలి, మందస పోలీసులు వెంకట్రావ్ ఇంటికి చేరుకున్నారు.
ఆ సమయంలో వెంకట్రావ్ ఇంట్లో లేకపోవడంతో భార్య కృష్ణవేణికి విషయం చెప్పి.. పోలీస్ స్టేషన్ కు రావాల్సి ఉంటుందని హెచ్చరించి వెళ్లిపోయారు. కొద్దిసేపటికి ఇంటికొచ్చిన వెంకట్రావుకు.. కృష్ణవేణి పోలీసులు వచ్చివెళ్లిన విషయం చెప్పింది. దాంతో భయాందోళనకు గురైన వెంకట్రావ్ సోమవారం రాత్రి 7 గంటల సమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించారు. కుటుంబ సభ్యులు అప్రమత్తమై వెంటనే పలాస ప్రభుత్వాస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్థారించారు. విషయం తెలిసిన టీడీపీ నేతలు, కార్యకర్తలు నిన్న ఉదయం ఆసుపత్రికి చేరుకుని ఆందోళనకు దిగారు. పోలీసుల వేధింపులు భరించలేకే వెంకటరావు ఆత్మహత్య చేసుకున్నారని, మంత్రి అప్పలరాజు ఒత్తిడితోనే పోలీసులు ఈ పనిచేశారని ఆరోపించారు. వెంకటరావు మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.
పలాస ఆస్పత్రి వద్ద పరిస్థితి తెలుసుకున్న డీఎస్పీ శివరామిరెడ్డి అక్కడికి చేరుకుని.. టిడిపి నాయకులతో చర్చలు జరిపారు. బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని, బాధితులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. డీఎస్పీ హామీతో వెంకటరావు మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు. ఈ ఘటనపై నారా లోకేష్, అచ్చెన్నాయుడు సహా పలువురు టిడిపి నేతలు తీవ్రంగా స్పందించారు. వెంకట్రావును ఆత్మహత్య చేసుకునేలా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Next Story