Mon Dec 23 2024 01:37:39 GMT+0000 (Coordinated Universal Time)
అత్తాపూర్ లో పీఈటీ టీచర్ ని వాయించిన జనం
విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఉపాధ్యాయుడు విష్ణును స్కూల్ యాజమాన్యం కాపాడే ప్రయత్నం
అత్తాపూర్ లో విద్యార్థిని వేధించిన టీచర్ కు ప్రజలు దేహ శుద్ధి చేశారు. రాజేంద్రనగర్ పరిధిలోని ప్రైవేట్ స్కూల్ లో విష్ణు అనే వ్యక్తి పీఈటీగా పనిచేస్తున్నాడు. గత కొద్ది రోజులుగా విష్ణు ఆ స్కూల్ లో 8 తరగతి చదువుతోన్న విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. విద్యార్థినికి ఫోన్లు చేసి ఇబ్బంది పెట్టడంతో విద్యార్థిని ఈ విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో ఆమె తల్లిదండ్రులు, బంధువులు స్కూల్ కు చేరుకున్నారు. అప్పుడు విష్ణు ఇంకా స్కూల్ కు రాలేదని అతని ఫోన్ కూడా స్వీచ్ ఆఫ్ వస్తుందంటూ స్కూల్ యాజమాన్యం బుకాయించింది. చివరికి అతని జాడ కనిపెట్టి చితక్కొట్టారు.
విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఉపాధ్యాయుడు విష్ణును స్కూల్ యాజమాన్యం కాపాడే ప్రయత్నం చేస్తోందనే విషయం తెలుసుకున్న విద్యార్థిని కుటుంబ సభ్యులు, బంధువులు పట్టుకుని అతడిని చితకబాదారు. ఆ తర్వాత పోలీసులకు అప్పగించారు. ఉదయం స్కూల్ కు వచ్చిన విష్ణును యాజమాన్యమే దాచిపెట్టిందనే ఆరోపణలు ఉన్నాయి. విద్యార్థిని కుటుంబ సభ్యులు విష్ణు గురించి అడగ్గా.. అతను స్కూల్ కు ఇంకా రాలేదని, అతని ఫోన్ కూడా స్వీచ్ ఆఫ్ వస్తుందని చెప్పారు. కానీ విద్యార్థిని కుటుంబ సభ్యులు విష్ణును కనిపెట్టి బయటకు పట్టుకొచ్చి చితకబాది పోలీసులకు అప్పగించారు. విద్యార్థి సంఘాలు కూడా పాఠశాలకు చేరుకుని విద్యార్థినుల భద్రతపై ఆందోళనకు దిగాయి. పాఠశాలల యాజమాన్యం విద్యార్థుల భద్రతపై దృష్టి సారించడం లేదని, కేవలం ఫీజుల వసూళ్లపైనే శ్రద్ధ చూపుతోందని విమర్శించారు విద్యార్థి సంఘాల నేతలు. ఇలాంటి వాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు.
Next Story