Mon Dec 23 2024 07:29:44 GMT+0000 (Coordinated Universal Time)
ప్రాణం తీసిన ఫేస్ బుక్ పరిచయం.. భర్తని, పిల్లల్ని వదిలి అతని కోసం..
నిజామాబాద్ కు చెందిన ఉస్మా బేగం (32)కు షెహజాద్తో ఫేస్బుక్లో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో నవంబర్ 6న..
ఫేస్ బుక్ పరిచయం ఆమె పాలిట శాపమైంది. ఫేస్ బుక్ లో పరిచయమైన వ్యక్తి కోసం భర్త, ఇద్దరు పిల్లల్ని వదిలి వెళ్లిన వివాహిత అతని చేతిలోనే దారుణంగా చంపబడింది. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ లో జరగ్గా.. బాధితురాలిది తెలంగాణలోని నిజామాబాద్. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. యూపీలోని అమ్రోహా జిల్లా గజరౌలా పోలీస్ స్టేషన్ పరిధిలోని చెక్మేట్ సెక్యూరిటీ కంపెనీ ఆవరణలో మూడు రోజుల క్రితం ఓ వివాహిత మృతదేహం లభ్యమైంది. గుర్తుతెలియని ఆ వివాహితకు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు.. పోలీసులు తొలుత కంపెనీ ఉద్యోగులను విచారించారు. ఈ క్రమంలో కంపెనీ తాళంచెవి ఒకటి షెహజాద్ అనే యువకుడి వద్ద ఉంటుందని తెలిసింది. దీంతో అతడిని అదుపులోకి తీసుకుని విచారించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిజామాబాద్ కు చెందిన ఉస్మా బేగం (32)కు షెహజాద్తో ఫేస్బుక్లో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో నవంబర్ 6న అతడిని కలిసేందుకు ఉస్మాబేగం యూపిలోని గజరౌలా చేరుకుంది. షెహజాద్ ను కలిసి పెళ్లి చేసుకుందామని ఒత్తిడి చేసింది. షెహజాద్ తనకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని చెప్పినా.. ఆమె వినకుండా పదే పదే అడగడంతో.. ఆగ్రహంతో ఆమెను దుపట్టాతో కట్టేసి ఇటుకతో తలపై కొట్టి చంపేశాడు. ఆ తర్వాత కంపెనీ ఆవరణలో ఓ మూలన ఆమె మృతదేహాన్ని పడేసి వెళ్లిపోయాడు.
భార్య కనిపించకపోవడంతో.. ఉస్మా బేగం భర్త ముఖీద్ ఈ నెల 6న బాన్సువాడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకుని గాలింపు చేపట్టిన పోలీసులకు యూపీలో ఉస్మా బేగం హత్యకు గురైనట్టు తెలిసింది. ముఖీద్ కు, ఉస్మా బేగానికి 12 ఏళ్ల క్రితం వివాహమవ్వగా.. ఇద్దరు పిల్లలున్నారు. తరచూ ఇద్దరి మధ్యన మనస్పర్థలు చోటుచేసుకోవడంతో ఉస్మా రెండు నెలలపాటు నిజామాబాద్లో ఉంది. ఆ తర్వాత పెద్దలు రాజీ కుదర్చడంతో ఈ నెల 4న తిరిగి బాన్సువాడ చేరుకుంది. ఆ తర్వాత రెండు రోజులకే ఇంటి నుండి వెళ్లిపోయి హత్యకు గురైంది.
Next Story