Fri Dec 27 2024 03:22:23 GMT+0000 (Coordinated Universal Time)
బాలుడు హత్య కేసులో కోర్టు సంచలన తీర్పు.. నిందితుడికి మరణ శిక్ష
నేరాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. అభం శుభం తెలియని చిన్నారులను సైతం ప్రాణాలు తీస్తున్నారు నేరగాళ్లు. డబ్బుల..
నేరాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. అభం శుభం తెలియని చిన్నారులను సైతం ప్రాణాలు తీస్తున్నారు నేరగాళ్లు. డబ్బుల కోసం పిల్లలను కిడ్నాప్ చేసి హతమారుస్తున్నారు. తాజాగా ఓ బాలుడి కిడ్నాప్, హత్య కేసులో మహబూబాబాద్ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. దోషిగా తేలిన మంద సాగర్‌కు కోర్టు మరణ శిక్ష విధిస్తూ సంచలన తీర్పు ఇచ్చింది. దీంతో తమకు తగిన న్యాయం జరిగిందంటూ బాధిత కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. 2020లో డబ్బు కోసం దీక్షిత్ (9) అనే బాలుడిని కిడ్నాప్ చేసి అత్యంత కిరాతకంగా హతమార్చిన కేసులో దోషి మంద సాగర్ కి మరణ శిక్ష పడింది. మహబూబాబాద్‌కు చెందిన జర్నలిస్టు రంజిత్ రెడ్డి, వసంతల కుమారుడైన తొమ్మిదేళ్ల బాలుడు దీక్షిత్‌ని మంద సాగర్ కిడ్నాప్ చేశాడు. ఆ తర్వాత కేసముద్రం మండలం అన్నారం శివారులోని దానమయ్య గుట్టపైకి తీసుకువెళ్లి పిల్లాడిపై పెట్రోల్ పోసి తగలబెట్టి చంపేశాడు. ఆ దారుణ హత్య అనంతరం తల్లిదండ్రులకు ఫోన్ చేసి 45 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు మంద సాగర్. ఈ కేసు అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది.
ఇక పోలీసులకు దొరక్కుండా ఇంటర్నెట్ కాల్స్ ద్వారా తల్లిదండ్రులకు ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేస్తూ వచ్చాడు. అయితే కిడ్నాప్ అయిన బాలుడిని ప్రాణాలతో కాపాడాలని పోలీసులు చేసిన ప్రయత్నం ఏ మాత్రం ఫలించలేదు. చివరికి బాలుడు కనరాని లోకానికి వెళ్లిపోయాడు. చిన్నపిల్లాడిని హతమార్చిన మంద సాగర్ ఒక సైకిల్ పంక్చర్ షాప్ నడుపుకునేవాడు. అప్పట్లో ఎస్పీ కోటిరెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు విచారణ చేపట్టి మంద సాగర్ ను అరెస్ట్ చేశారు. మూడేళ్ళ పాటు సాగిన ఈ కేసు విచారణ ఎట్టకేలలో ఎట్టకేలకు తీర్పు వచ్చింది. న్యాయ దేవత, పోలీసుల చిత్ర పటాలకు పాలాభిషేకం చేసిన దీక్షిత్ రెడ్డి కుటుంబ సభ్యులు జడ్జి తీర్పుతో న్యాయం ఇంకా బ్రతికే ఉందని పేర్కొన్నారు.
Next Story