Mon Dec 23 2024 03:04:21 GMT+0000 (Coordinated Universal Time)
అదీ ఆ రౌడీ షీటర్ రేంజి.. పోలీస్ స్టేషన్ లో హ్యాపీ బర్త్ డే
సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది
భూపాలపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి పోలీస్ స్టేషన్లో ఓ పుట్టినరోజు వేడుక జరిగింది. పోలీస్ స్టేషన్ లో అంటున్నారు.. ఎస్.ఐ. పుట్టినరోజో.. లేక కానిస్టేబుల్ పుట్టినరోజో అని అనుకోకండి. ఓ రౌడీ షీటర్ పుట్టినరోజు. హత్యకు పాల్పడిన రౌడీ షీటర్ పుట్టినరోజును సబ్ ఇన్స్పెక్టర్ జరిపించి వివాదంలో చిక్కుకున్నారు. ఈ ఘటన ఆదివారం జరిగినప్పటికీ ఓ వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
రౌడీషీటర్ వి.మహేందర్ గౌడ్ జన్మదిన వేడుకలను ఆదివారం పోలీస్ స్టేషన్ లో ఎస్.ఐ టి.మాధవ్ గౌడ్ నిర్వహించారు. ఆ పోలీస్ స్టేషన్లోనే మహేందర్ గౌడ్ పేరుతో రౌడీషీట్ తెరిచి నోటీసు బోర్డుపై అతని ఫోటో కూడా ఉంది. ఆ వ్యక్తి నేపథ్యం పూర్తిగా తెలిసినప్పటికీ ఎస్ఐ పోలీస్‌స్టేషన్‌లోనే పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. ఘటనపై ఎస్ఐకి మెమో జారీ చేసి వివరణ కోరుతామని భూపాలపల్లి డీఎస్పీ ఏ సంపత్‌రావు తెలిపారు. ఎస్ఐపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు పోలీసు సూపరింటెండెంట్‌ను కోరారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ గురించి తెలుసు కానీ.. ఏకంగా పోలీసు స్టేషన్ లో క్రిమినల్ కు బర్త్ డే జరిపే అంత ఫ్రెండ్లీగా తెలంగాణ పోలీసులు ఉంటారని అసలు అనుకోలేదని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
Next Story