Mon Dec 23 2024 14:30:00 GMT+0000 (Coordinated Universal Time)
పిల్లల్ని కనడం లేదని భార్యపై కిరాతకం
తప్పెవరిది, లోపం ఎవరిలో ఉందని కూడా ఆలోచించకుండా భార్య గర్భం దాల్చడం లేదన్న కోపంతో..
చిన్న చిన్న తగాదాలే.. హత్యలకు దారితీస్తున్నాయి. పిల్లలను కనే విషయంలో దంపతుల మధ్య జరిగిన గొడవ.. భార్య ప్రాణాలు తీసింది. మహారాష్ట్రలోని థానే జిల్లాలో ఈ విషాద ఘటన జరిగింది. తప్పెవరిది, లోపం ఎవరిలో ఉందని కూడా ఆలోచించకుండా భార్య గర్భం దాల్చడం లేదన్న కోపంతో ఆమెను చంపేశాడు భర్త. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అంబర్ నాథ్ ప్రాంతంలోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ కాలనీలో దంపతులు నివాసం ఉంటున్నారు. భర్త ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో ఉద్యోగం చేస్తుండేవాడు. తరచూ వీరిద్దరికీ సంతానం విషయంలో గొడవలు జరుగుతుండేవి.
ఆదివారం సాయంత్రం కూడా భార్య గర్భం దాల్చడం లేదన్న విషయంపై గొడవ జరిగింది. ఈ క్రమంలో భర్త.. భార్యపై పదునైన ఆయుధంతో దాడి చేయగా.. ఆమె ఇంట్లోనే కుప్పకూలిమరణించింది. విషయం తెలిసిన ఫ్యాక్టరీలో వర్కర్స్ యూనియన్ ప్రతినిధి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు ఘటనా ప్రాంతానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నిందితుడైన భర్తను అరెస్ట్ చేసి, అతనిపై హత్యానేరం కింద కేసు నమోదు చేశారు.
Next Story