Fri Nov 22 2024 22:49:58 GMT+0000 (Coordinated Universal Time)
ఇంటిని, ఇల్లాలిని మరిచిపోయాడు.. ఇక భరించలేక ఆ భార్య..
ఈరోజు కాకపోతే రేపైనా మారతాడన్న ఆశతో ఎదురుచూసిన శ్రీలక్ష్మి విసుగుచెందింది. అప్పులు, తాగుడు తప్ప మరో ధ్యాస లేని భర్త..
భరించేవాడే భర్త అంటారు. భరించడం కాదు కదా.. కనీసం భార్యను పట్టించుకోవడం లేదు. ఇంటిని, ఇల్లాలిని పూర్తిగా మరచిపోయి జల్సాలకు అలవాటు పడ్డాడు. ఎప్పటికైనా మారతాడని ఎదురుచూసిన ఆ భార్య.. ఇక సహనం కోల్పోయి సుపారీ ఇచ్చి భర్తను హత్యచేయించింది. ఈ ఘటన తెలంగాణలో వెలుగుచూసింది. హత్య జరిగిన నాలుగు రోజుల తర్వాత భార్యే దోషి అని పోలీసుల విచారణలో తేలింది. వివరాల్లోకి వెళ్తే..
నల్గొండ పట్టణ శివారులోని మిషన్ కాంపౌండ్ వద్ద రఘురాములు అనే వ్యక్తి హత్యకు గురవ్వగా.. అందుకు సంబంధించిన వివరాలను దేవరకొండ పోలీస్ కార్యాలయంలో డీఎస్పీ నాగేశ్వరరావు వెల్లడించారు. రఘురాములు స్టాంప్ వెండర్ గా పనిచేస్తున్నాడు. నగరంలోని విష్ణు కాంప్లెక్స్ లో కిడ్స్ వేర్ దుకాణం కూడా ప్రారంభించాడు. ఆ షాపు బాధ్యతను భార్య శ్రీలక్ష్మి చూసుకునేది. ఇటు ఉద్యోగం మానేయడంతో పాటు అటు షాపును కూడా పట్టించుకోవడం మానేసిన రఘు జల్సాలకు అలవాటుపడ్డాడు. దొరికిన కాడికి అప్పులు చేసుకుంటూ.. తాగుడుకి బానిసయ్యాడు.
ఈరోజు కాకపోతే రేపైనా మారతాడన్న ఆశతో ఎదురుచూసిన శ్రీలక్ష్మి విసుగుచెందింది. అప్పులు, తాగుడు తప్ప మరో ధ్యాస లేని భర్త ఇక ఉండటం అనవసరంగా భావించింది. అతడిని అంతమొందించాలని నిర్ణయించుకుంది. హైదరాబాద్ లో ఉంటున్న తన స్నేహితురాలి భర్తతో పరిచయం పెంచుకుని.. రఘురాములుని చంపేందుకు సహాయం కోరింది. చిలకరాజు అరుణ్ అనే వ్యక్తితో భర్తను చంపేందుకు రూ.5 లక్షలకు సుపారీ మాట్లాడింది. ప్లాన్ ప్రకారం భర్త తాగే మద్యంలో నిద్రమాత్రలు కలిపింది. ఆ తర్వాత అరుణ్ రఘురాములు ముక్కు, నోటిలో సైనేడ్ పోశాడు. దాంతో అతను ఊపిరాడక మరణించాడు.
రఘురాములు మరణం తర్వాత అక్కడి నుంచి హైదరాబాద్ కు పారిపోయారు. అదేరోజు రాత్రి 10 గంటల సమయంలో అరుణ్ శ్రీలక్ష్మికి ఇన్ స్టా గ్రామ్ లో కాల్ చేసి.. రఘురాములును హత్యచేసినట్లు తెలిపారు. రఘురాములు హత్య కేసు విచారణలో భాగంగా అతని భార్యను విచారించగా.. అసలు విషయం తెలిసిందన్నారు. ప్రస్తుతం శ్రీలక్ష్మి పోలీసుల కస్టడీలో ఉందని..ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉందని డీఎస్పీ నాగేశ్వరరావు తెలిపారు.
Next Story