Mon Dec 23 2024 15:26:13 GMT+0000 (Coordinated Universal Time)
కొత్త వెంకోజిపాలెంలో దొంగల వీరంగం.. మహిళపై పెద్ద బండరాయితో దాడి..
ఖాకీల నిర్లక్ష్యమే కారణమంటున్న బాధిత మహిళ విశాఖ జిల్లా కొత్త వెంకోజిపాలెంలో దారుణం చోటుచేసుకుంది.
ఖాకీల నిర్లక్ష్యమే కారణమంటున్న బాధిత మహిళ
విశాఖ జిల్లా కొత్త వెంకోజిపాలెంలో దారుణం చోటుచేసుకుంది. ఫుల్ గా తాగిన వెంకోజిపాలేనికి చెందిన కల్లేపల్లి వాసు, లోకేశ్ సహా మొత్తం నలుగురు బృందం అర్ధరాత్రి దొంగతనానికి వచ్చిన సమయంలో వారిపై స్థానిక మహిళలు తిరగబడ్డారు. దీంతో దుండగులు మహిళలపై పెద్ద పెద్ద బండరాళ్లతో దాడికి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళితే.. గంగలక్ష్మి (60) తమ ఇంటి ముందు మామిడిచెట్టు వద్ద దొంగల అలికిడితో అప్రమత్తమై వారిని తరిమికొట్టే క్రమంలో దొంగలు ఎదురుదాడికి దిగారు. ఈ ఘటనలో ఆమె కాలుకు తీవ్ర గాయాలయ్యాయి. ఇదంతా సోమవారం ఉదయం 2 గంటల సమయంలో జరగగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికంగా ఏర్పాటు చేసిన సీసీ ఫుటేజ్ ద్వారా ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు బయటకొచ్చాయి. ఇంత జరిగినా పోలీసులు స్పందించడంలో విఫలమయ్యారు. దుండగులు పారిపోతూ పెద్ద రాయిని తీసుకొచ్చి తనపై విసిరారని.. అది తలకు బదులు తప్పిపోయి కాలుకు తగిలిందని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. అయినా కాలు విరిగి అల్లాడుతున్న మహిళపై కరుణ లేకుండా.. నిందితులను అరెస్ట్ చేయడంలో ఖాకీలు అలసత్వం వహించారని బాధిత మహిళ ఆరోపించింది. ఈ ఘటన జరిగిన వెంటనే 100కి ఎన్ని సార్లు ఫోన్ చేసినా స్పందన కరువైందని.. నేరుగా ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదంది. దీంతో తమ ఇంటి యజమాని గంగలక్ష్మికి న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. కాలుకు బదులు తలకు తగిలుంటే మా పరిస్థితి ఏంటని గంగలక్ష్మి కూతుళ్లు ప్రశ్నించారు. ఇలాంటి అల్లరి మూకల ఆట కట్టించేందుకు వెంటనే స్పందించే పోలీస్ వ్యవస్థ కావాలని విశాఖ వాసులు కోరుకుంటున్నట్లు బాధిత కుటుంబీకులు కోరారు. తమకు జరిగిన నష్టాన్ని దొంగల నుంచి వసూలు చేయాల్సిందేనని స్థానికుల డిమాండ్ చేశారు.
Next Story