Mon Dec 23 2024 10:41:29 GMT+0000 (Coordinated Universal Time)
నలుగురు దొంగలను తరిమికొట్టిన విశాఖపట్నం మహిళ
విశాఖపట్నంలో ఓ మహిళ తన ఇంట్లోకి ప్రవేశించిన నలుగురు దొంగలను తరిమికొట్టింది. విశాఖపట్నం జిల్లా పెందుర్తి నియోజకవర్గం చీమలపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. రిటైర్డ్ ఉద్యోగి ఆళ్ల అప్పారావు తన భార్య లలిత కుమారి, ఇద్దరు కుమారులు చెరువుగట్టు సమీపంలో నివసిస్తున్నారు. ఆయన కుమారుడు అవినాష్‌కి లావణ్యతో ఇటీవల వివాహం జరిగింది. మంగళవారం రాత్రి అవినాష్ డ్యూటీకి వెళ్లాడు. కుటుంబ సభ్యులంతా ఓ గదిలో, లావణ్య మరో గదిలో నిద్రిస్తున్నారు. అర్ధరాత్రి 1.30 గంటల సమయంలో దొంగలు కిటికీ గ్రిల్ తొలగించి ఇంట్లోకి ప్రవేశించారు. కుటుంబసభ్యులు నిద్రిస్తున్న ఆరుబయట గదికి బోల్ట్ వేసి లావణ్య గది తలుపులు పగులగొట్టి వస్తువులను దొంగిలించేందుకు ప్రయత్నించారు. డోర్ పగలగొట్టిన శబ్దానికి లావణ్య లేచింది. ఆమె వారిని ప్రతిఘటించడంతో అక్కడి నుంచి పరారయ్యారు.
అప్పారావు, లలితకుమారి, వినయ్‌కుమార్ పడుకుని ఉన్న గది తలుపుకు బయట గడియపెట్టారు. లావణ్య పడుకుని ఉన్న గది తలుపును గట్టిగా బాదడంతో బోల్టు ఊడి.. తలుపు తెరుచుకుంది. దీంతో వారు లోపలకి ప్రవేశించారు. నిద్రలేచిన లావణ్య తేరుకునే లోపే గదిలో ఉన్న బీరువాను తెరిచేందుకు యత్నించారు. కానీ లావణ్య వారిని గట్టిగా పట్టుకుని కేకలు వేసింది. ఆమె అరుపులకు ఏం జరిగిందో అని పక్క గదిలో ఉన్న అప్పారావు, లలితకుమారి, వినయ్‌కుమార్ నిద్రలేచారు. బయటకు వద్దామని ప్రయత్నిస్తే గది బయట గడియవేశారు. లావణ్యతో పాటు కుటుంబ సభ్యులు కూడా పెద్దగా కేకలు వేయడంతో దొంగలు తప్పించుకునేందుకు లావణ్యను పొట్ట భాగం, కాళ్లపైన కత్తితో పొడిచి అక్కడి నుంచి పరారయ్యారు. రక్తంతోనే లావణ్య అత్తమామలు, బావ నిద్రిస్తున్న తలుపు గడియ తీసింది. వెంటనే ఆమెను నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. క్రైం డీసీపీ నాగన్న, ఏడీసీపీ దుర్గాప్రసాద్, గంగాధర్, ఏసీపీ పెంటారావు, క్రైమ్ సీఐ దుర్గాప్రసాద్, పెందుర్తి లా అండ్ సీఐ నాగేశ్వరరావు తదితరులు ఘటన స్థలానికి వచ్చి పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మొత్తం నలుగురు దుండగులు దొంగతనానికి వచ్చి.. ఇద్దరు ఇంట్లోకి ప్రవేశించినట్టు స్థానికులు చెబుతున్నారు. ఇంటి ప్రహరీ దూకి వీరంతా వచ్చినట్టు భావిస్తున్నారు. అప్పారావు ఇంటి పక్కనే ఉన్న మరో ఇంటి బయట ఆరేసున్న దుస్తులను ముక్కలుగా చేసి ముఖానికి కట్టుకుని లోపలికి ప్రవేశించినట్లు తెలుస్తోంది.
Next Story