Mon Dec 23 2024 13:32:40 GMT+0000 (Coordinated Universal Time)
హైదరాబాద్ లో ఒకేరోజు ముగ్గురు వివాహితలు మృతి
రంగారెడ్డిజిల్లా కొందుర్గు మండల కేంద్రానికి చెందిన జాల వెంకటయ్య కుమార్తె మమత (30)ను 2008లో అదే గ్రామానికి ..
కడదాకా తోడుంటానని మాటిచ్చి మనువాడినోళ్లే.. కట్టుకున్న భార్యల పాలిట కాలయముళ్లయ్యారు. భాగ్య నగరంలో 24 గంటల్లో వేర్వేరు ఘటనలు కలకలం సృష్టించాయి. ఎస్సార్ నగర్ పీఎస్ పరిధిలో ఓ భర్త భార్యను చంపి తాను కూడా బలవన్మరణానికి పాల్పడ్డాడు. కేపీహెచ్ బీలో ఒకరు, కొందుర్గులో మరొక వివాహిత భర్త దాష్టీకానికి బలయ్యారు.
వివరాల్లోకి వెళ్తే..ఎల్లారెడ్డిగూడకు చెందిన ఆగమయ్య కుమారుడు జనార్థన్ (40) మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా తూముకుంటకు చెందిన ప్రేమలత (35)తో 2004లో వివాహమైంది. వీరికి కుమారుడు బాలాజీ (17) కుమార్తె లిఖిత (16) ఉన్నారు. ప్రేమలత కూకట్ పల్లిలోని ఓ డెంటల్ క్లీనిక్ లో పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. భర్త జనార్థన్ ఏ పనీ చేయకుండా మద్యానికి బానిసై ఇంట్లోనే ఉంటున్నాడు. ఈ విషయమై దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ప్రేమలత తల్లిదండ్రులు లక్ష్మి, యాదయ్యల పెళ్లిరోజు వేడుక సోమవారం మే(15) తూముకుంటలో జరిగింది. ఈ వేడుకకు దంపతులిద్దరూ హాజరయ్యారు. వేసవి సెలవులు కావడంతో పిల్లలిద్దరినీ అమ్మమ్మ ఇంటివద్దే వదిలి తిరిగి ఇంటికి వచ్చారు.
మంగళవారం ఎంత పొద్దెక్కినా తలుపులు తీయకపోవడంతో.. జనార్థన్ తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులు గొళ్లెం బద్దలుకొట్టి చూడగా.. ప్రేమలతో నోట్లో గుడ్డకుక్కి రక్తపుమడుగులో పడి కనిపించింది. జనార్థన్ సీలింగ్ ఫ్యాన్ ఉరికి వేలాడుతూ ఉన్నాడు. భార్యను ఇనుపరాడ్ తో మోది చంపి ఆపై తాను కూడా బలవన్మరణానికి పాల్పడినట్లు ఎస్సార్ నగర్ పోలీసులు నిర్థారించారు.
రంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం బూసిరెడ్డిపల్లికి చెందిన సాధిక్ అలీ(37)కి మూసాపేటకు చెందిన మున్నీబేగం (35)తో 17 ఏళ్లక్రితం వివాహమైంది. వీరికి 15,9 ఏళ్ల వయసున్న ఇద్దరు కుమార్తెలున్నారు. వారి ఆలనా పాలనా మున్నీబేగం తల్లిదండ్రులే చూస్తున్నారు. పిల్లలిద్దరూ అక్కడ ఓ కంపెనీలో పనిచేస్తున్నారు. మున్నీబేగం, సాధిక్ లు ఫోరం మాల్ ఎదురుగా ఉన్న వంతెన కింద నివాసముంటున్నారు. మద్యానికి బానిసైన అతడు సోమవారం రాత్రి 7 గంటలకు మున్నీతో గొడవ పడ్డాడు. 9 గంటల సమయంలో ఒక రాయితో మున్నీబేగం తల, ముక్కుపై కొట్టి గాయపరచగా.. స్థానిక ఆటోడ్రైవర్లు ఆమెను రాందేవ్ రావు ఆస్పత్రికి తరలించారు. కానీ మున్నీ అప్పటికే మరణించడంతో.. మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు.
రంగారెడ్డిజిల్లా కొందుర్గు మండల కేంద్రానికి చెందిన జాల వెంకటయ్య కుమార్తె మమత (30)ను 2008లో అదే గ్రామానికి చెందిన సున్నాల యాదయ్యకు ఇచ్చి పెద్దలు వివాహం జరిపించారు. వీరికి ముగ్గురు సంతానం. యాదయ్య కుటుంబ బాధ్యతలు పట్టించుకోకుండా దురలవాట్లకు బానిసయ్యాడు. మద్యం మత్తులో తరచూ భార్యతో గొడవ పడుతూ మానసికంగా, శారీరకంగా హింసించేవాడు. సోమవారం కూడా గొడవ పడ్డాడు. మంగళవారం మమత మృతి చెందిందని ఆమె తల్లిదండ్రులకు సమాచారం రావడంతో.. వారు మమత శరీర భాగాలపై గాయాలున్నట్లు గుర్తించారు. భర్త ఆమె విద్యుద్ఘాతానికి గురై మరణించిందని నమ్మబలికాడు. కొందుర్గు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. మృతదేహాన్ని పోస్టుమార్టమ్ కు పంపి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story