Mon Dec 30 2024 16:15:53 GMT+0000 (Coordinated Universal Time)
ఇడ్లీ విసిరేశాడని.. బిచ్చగాడి ప్రాణాలు తీసిన దుర్మార్గులు
పొట్లం ఇచ్చి ఊరుకోకుండా.. నువ్వు చడ్డీగ్యాంగ్ ముఠా సభ్యుడిలా ఉన్నావు. పోలీసులతో కాస్త జాగ్రత్తగా ఉండు అంటూ..
నల్లపాడు : ఇడ్లీ విసిరేశాడని ముగ్గురు వ్యక్తులు బిచ్చగాడి ప్రాణాలను హరించిన ఘటన గుంటూరు అర్బన్ , నల్లపాడు పరిధిలో జరిగింది. ఆలస్యంగా వెలుగుచూసిన.. ఈ కేసుకు సంబంధించిన వివరాలను గుంటూరు సౌత్ డీఎస్పీ జెస్సి ప్రశాంతి మీడియాకు తెలిపారు. పోలీసులు చెప్పిన వివరాల మేరకు.. గుంటూరు హోసింగ్ బోర్డు కాలనీలో ఓ వ్యక్తి స్థానికంగా బిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. మే 1వ తేదీ అర్థరాత్రి సమయంలో మద్యం సేవించి ఉన్న మహేష్ అనే వ్యక్తి.. తనతో తెచ్చుకున్న ఇడ్లీ పొట్లాన్ని ఆ బిచ్చగాడికి ఇచ్చాడు.
పొట్లం ఇచ్చి ఊరుకోకుండా.. నువ్వు చడ్డీగ్యాంగ్ ముఠా సభ్యుడిలా ఉన్నావు. పోలీసులతో కాస్త జాగ్రత్తగా ఉండు అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేశాడు. మహేష్ మాటలకు బాధపడిన బిచ్చగాడు.. అతను ఇచ్చిన ఇడ్లీ పొట్లాన్ని విసిరేశాడు. కోపంతో ఊగిపోయిన మహేష్.. అర్థరాత్రి 1.30 గంటల సమయంలో మరో ఇద్దరు స్నేహితులు అనిల్, సతీష్ తో కలిసి వచ్చి బిచ్చగాడిని తీవ్రంగా కొట్టాడు. అంతటితో ఊరుకోకుండా.. తన బైక్ పై ఎక్కించుకుని అంకిరెడ్డిపాలెం డొంకరోడ్డులోకి తీసుకెళ్లారు.
అక్కడ ముగ్గురూ కలిసి మరోసారి బిచ్చగాడిని విచక్షణా రహితంగా కొట్టారు. దెబ్బలు తాళలేక బిచ్చగాడు అక్కడిక్కడే మృతి చెందాడు. దాంతో మహేష్, అనిల్, సతీష్ లు అక్కడినుంచి పరారయ్యారు. బిచ్చగాడి మృతిపై అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు..దర్యాప్తు చేసి, గురువారం ముగ్గురు నిందితుల్నీ అదుపులోకి తీసుకున్నారు. మహేష్, అనిల్, సతీష్ లు స్థానికంగా ముఠా పనులకు వెళ్తుంటారని..ఇడ్లి ఇస్తే తినలేదని కారణంతోనే మద్యం మత్తులో బిచ్చగాడని కొట్టి చంపినట్లు పోలీసులు వెల్లడించారు.
Next Story