Wed Apr 16 2025 13:40:03 GMT+0000 (Coordinated Universal Time)
హీరో సూర్య బర్త్ డే వేడుకల్లో విషాదం
పల్నాడు జిల్లా నరసరావపేట మండలం కోటప్పకొండ సమీపంలోని యక్కాలవారిపాలెం గ్రామంలో ఈ ఘటన..

ప్రముఖ సినీ నటుడు, హీరో సూర్య పుట్టినరోజు వేడుకల్లో విషాద ఘటన చోటుచేసుకుంది. అభిమాన హీరో ఫ్లెక్సీ కడుతూ ఇద్దరు యువకులు కరెంట్ షాక్ తగిలి మృతి చెందారు. పల్నాడు జిల్లా నరసరావపేట మండలం కోటప్పకొండ సమీపంలోని యక్కాలవారిపాలెం గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సూర్య అభిమానులైన ముగ్గురు యువకులు ఆదివారం తెల్లవారుజామున గ్రామంలో.. సూర్య పుట్టినరోజు వేడుకలను నిర్వహించేందుకు బ్యానర్ కడుతుండగా.. పక్కనే ఉన్న విద్యుత్ స్తంభం నుంచి కరెంట్ షాక్ తగిలింది.
ఈ ఘటనలో నక్క వెంకటేష్ (19), పోలూరి సాయి (20) అనే ఇద్దరు యువకులు మృతి చెందగా.. మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. అతడిని గ్రామస్తులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. మృతులు వెంకటేష్, సాయి డిగ్రీ రెండో ఏడాది చదువుతున్నట్లు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా ప్రాంతానికి చేరుకుని మృతదేహాలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేశారు. యువకుల ఆకస్మిక మరణాలతో.. వారి కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటగా.. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Next Story