Mon Dec 23 2024 16:12:53 GMT+0000 (Coordinated Universal Time)
కండక్టర్ చేసిన అవమానాన్ని భరించలేక.. ఆ వ్యక్తి..?
కండక్టర్ తాగి నిద్రపోతున్నావంటూ చేసిన అవమాన భారాన్ని భరించలేక అతను ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన కేరళలో వెలుగుచూసింది
ఆస్పత్రిలో చికిత్స తీసుకుని, తిరిగి ఇంటికి వెళ్లేందుకు బస్సు ఎక్కిన ఓ వ్యక్తిపై కండక్టర్ తాగి నిద్రపోతున్నావంటూ చేసిన అవమాన భారాన్ని భరించలేక అతను ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన కేరళలో వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. కేరళ రాష్ట్రంలోని కొల్లాం జిల్లా భారతీపురం అనే గ్రామానికి చెందిన ఆని (46) కొన్ని నెలలుగా కిడ్నీ సంబంధిత సమస్యతో అనారోగ్యం బారిన పడ్డాడు. తిరువనంతపురంలోని ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న అతను.. సొంత ఊరి నుంచి తిరువనంతపురానికి అప్పుడప్పుడూ రాకపోకలు సాగిస్తున్నాడు. ఎప్పటిలాగే చికిత్స అనంతరం తిరిగి ఇంటికెళ్లేందుకు నవంబర్ 24న తిరువనంతపురంలో బస్సు ఎక్కాడు. అక్కడి నుంచి సొంత ఊరికి చాలా దూరం ప్రయాణించాల్సి ఉంటుంది. పైగా అనారోగ్యంతో ఉన్న వ్యక్తి కావడంతో.. కాస్త నీరసంగా అనిపించి తానుకూర్చున్న సీటులోనే నిద్రపోయాడు.
మత్తులో పడుకున్నావంటూ....
బస్సు ఎక్కిన ప్రయాణికులందరికీ టికెట్లు ఇచ్చేందుకు అటూ ఇటూ తిరుగుతున్న కండక్టర్ నిద్రలో ఉన్న ఆని ని చూసి తాగిన మత్తులో పడుకున్నాడని తప్పుగా అర్థం చేసుకున్నాడు. వెంటనే తన చేతిలో ఉన్న టికెట్ మిషన్ తో అతని తలపై కొట్టాడు. ఉలిక్కిపక్క ఆని.. ఏమైంది సార్ ? అని అడగ్గా.. తాగి నిద్రపోతున్నావా ? మందు తాగి బస్సులెందుకు ఎక్కుతారంటూ అనరాని మాటలు అన్నాడు. ఆని తాను తాగలేదని చెప్పేందుకు ప్రయత్నించగా వినకపోగా.. అతనిపై దాడి చేశాడు. తాను పేషంట్నని.. ఆరోగ్యం బాగోలేక ఇలా పడుకున్నానని చెప్పినా కండక్టర్తో పాటు బస్సులో ఉన్న వాళ్లెవరూ వినిపించుకోలేదు. బస్సును నేరుగా పోలీస్ స్టేషన్ ముందుకు తీసుకెళ్లి ఆపారు. కండక్టర్ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కూడా ముందూ వెనకా ఆలోచించకుండా ఆని పై కేసు నమోదు చేసి, జరిమానా విధించారు.
అవమానం జరిగిందని...
ఆ తర్వాత ఆని పోలీసులకు తాను పేషంట్నని.. కావాలంటే రిపోర్ట్స్ చూడండని చూపిస్తే అప్పటికి అర్థం చేసుకున్నారు. అతనికి విధించిన జరిమానాను వెనక్కి తీసుకున్నారు. అయితే.. బస్సులో అందరి ముందు అంత అవమానం జరగడం, తనపై కండక్టర్ దాడి చేయడం.. తాగుబోతు అని ముద్ర వేయడం.. పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లడం.. ఈ పరిణామాలన్నీ ఆనిని తీవ్రంగా ఆవేదనకు గురిచేశాయి. ఇంటికి వెళ్లాక ఇంత అవమానం జరిగాక బతికి ఉండటం ఎందుకని భావించిన ఆని క్షణికావేశంలో గత శుక్రవారం రాత్రి ఆత్మహత్యకు యత్నించాడు. గమనించిన కుటుంబ సభ్యులు అతనిని ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ డిసెంబర్ 7, మంగళవారం చనిపోయాడు. ఆనిని కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆని మంగళవారం ఉదయం చనిపోయాడు. కుటుంబ సభ్యులు, బంధువులు ఆని ప్రాణం పోవడానికి కారణం ఆ బస్సు కండక్టరేనని.. అతనిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై తాము ముఖ్యమంత్రికి కూడా ఫిర్యాదు చేస్తామన్నారు.
.
Next Story