Thu Dec 19 2024 16:34:44 GMT+0000 (Coordinated Universal Time)
పెళ్లిబృందం వాహనం బోల్తా.. నలుగురు మృతి
ప్రమాదం జరిగిన ప్రాంతంలో ముగ్గురు మహిళలు, ఒక పురుషుడు మృతి చెందారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం..
చల్లపల్లి : కృష్ణాజిల్లా మోపిదేవి మండలం కాసానగర్ వద్ద గురువారం మధ్యాహ్నం ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. పెళ్లి బృందంతో వెళ్తున్న వ్యాన్ అదుపుతప్పి బోల్తా పడగా.. నలుగురు మృతి చెందారు. మరో ఏడుగురికి గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన ప్రాంతంలో ముగ్గురు మహిళలు, ఒక పురుషుడు మృతి చెందారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు.. ప్రమాద స్థలానికి చేరుకుని.. మృతదేహాలను వెలికితీశారు. ప్రమాదంలో మృతి చెందిన, గాయపడిన వారంతా చల్లపల్లి మండలం చింతలమడకకు చెందిన వారుగా గుర్తించారు. ప్రమాద సమయంలో వాహనంలో మొత్తం 15 మంది ఉన్నట్లు సమాచారం.
కాగా ఈ రోజు ఉదయం అన్నమయ్య జిల్లాలో జరిగిన మరో రోడ్డుప్రమాదంలో నలుగురు మృతి చెందారు. జిల్లాలోని మదనపల్లె గ్రామీణం పుంగనూరు రోడ్డులో 150వ మైలురాయి వద్ద వేగంగా దూసుకొచ్చిన కారు.. కల్వర్టును ఢీ కొట్టింది. వెంటనే పక్కనున్న చెరువులో పడిపోయింది. ప్రమాద సమయంలో కారులో నలుగురు ఉండగా.. వారంతా అక్కడికక్కడే మృతి చెందారు.
ప్రమాద ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటనా ప్రాంతానికి చేరుకున్న పోలీసులు.. స్థానికుల సహాయంతో మృతదేహాలను, కారును చెరువులో నుంచి వెలికి తీశారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారుగా గుర్తించారు. నిమ్మనపల్లె మండలం రెడ్డివారిపల్లెకు చెందిన దంపతులు గంగిరెడ్డి, మధులత, వారి కుమార్తె కుషితారెడ్డి, కుమారుడు దేవాన్ష్ రెడ్డిగా గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి, ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story