Sat Jan 11 2025 20:58:23 GMT+0000 (Coordinated Universal Time)
శ్రద్ధ తరహా హత్య.. ఇల్లాలి ప్రాణం తీసిన అనుమానం
తొలుత తనకేమీ తెలీదనడంతో పోలీసులు అనుమానించారు. తమదైన శైలిలో ప్రశ్నించగా.. అసలు విషయం బయటపడింది.
అనుమానం ఆ ఇల్లాలి పాలిట శాపమైంది. నూరేళ్లు తోడుంటానంటూ పెళ్లినాడు చేసిన ప్రమాణాలను మరిచిపోయి.. కట్టుకున్న భార్యను అత్యంత దారుణంగా హతమార్చాడు. ఇది మరో శ్రద్ధ తరహా హత్య కేసే. పశ్చిమ బెంగాల్ లో జరిగిన ఈ దారుణోదంతం.. ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. సిలిగురి సబ్‌డివిజన్ పరిధిలో నివాసం ఉంటున్న రేణుకా ఖాతూన్ (30) మహ్మద్ అన్సారుల్‌కు ఆరేళ్ల క్రితం పెళ్లైంది. పెళ్లి అనంతరం కొంతకాలం కాపురం సజావుగానే సాగింది. సిలిగురి వార్డ్ నెం. 43లోని దాదాభాయ్ కాలనీలో నివాసం ఉండేవారు. ఈ దంపతులకు ఒక కొడుకు కూడా ఉన్నాడు.
రేణుక అదే ప్రాంతంలోని ఓ బ్యూటీపార్లర్ లో పని నేర్చుకునేందుకు వెళ్లడం మొదలుపెట్టింది. ఈ క్రమంలో అన్సారుల్ కు భార్యపై అనుమానం ఏర్పడింది. ఎవరితోనో వెళ్తున్నావంటూ.. తరచూ గొడవపడేవాడు. ఈ క్రమంలోనే రేణుక కనిపించకుండా పోయింది. కూతురు కనిపించడం లేదంటూ తల్లిదండ్రులు డిసెంబర్ 24న సిలిగురి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
వారి ఫిర్యాదు మేరకు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు పోలీసులు. విచారణలో భాగంగా.. అన్సారుల్ ను ప్రశ్నించారు. తొలుత తనకేమీ తెలీదనడంతో పోలీసులు అనుమానించారు. తమదైన శైలిలో ప్రశ్నించగా.. అసలు విషయం బయటపడింది. డిసెంబర్ 24న అన్సారుల్ తన భార్యను హత్య చేసి, అనంతరం మృతదేహాన్ని రెండు ముక్కలుగా నరికి ఛత్ పక్కనే ఉన్న తీస్తా కాలువలోకి వేసినట్లు చెప్పాడు. అతడు చెప్పింది విని షాకయ్యారు. రేణుక మృతదేహ భాగాల కోసం జనవరి 5న తీస్తా కాలువలో గాలింపు చర్యలు చేపట్టారు. కూతుర్ని అల్లుడు హత్య చేశాడని తెలిసి తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. తమ కూతుర్ని పొట్టనపెట్టుకున్న ఆ దుర్మార్గుడిని కఠినంగా శిక్షించాలని, ఉరి శిక్ష వేయాలని డిమాండ్ చేస్తున్నారు.
Next Story