Mon Dec 23 2024 09:59:22 GMT+0000 (Coordinated Universal Time)
భర్తకు ఇంట్లోనే దహన సంస్కారాలు చేసిన భార్య
పట్టణానికి చెందిన పోతుగంటి హరికృష్ణ ప్రసాద్ (60), లలిత దంపతులు. వీరిద్దరూ స్థానికంగా మెడికల్ షాపు నిర్వహిస్తూ..
సాధారణంగా ఇంట్లో వారిలో ఎవరైనా మరణిస్తే అంత్యక్రియలు శ్మశానవాటికలో నిర్వహిస్తారు. కానీ ఓ మహిళ మాత్రం తన భర్తకు ఇంట్లోనే దహనసంస్కారాలు చేసింది. ఈ ఘటన కర్నూల్ జిల్లా పత్తికొండ నగరంలో సోమవారం వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పట్టణానికి చెందిన పోతుగంటి హరికృష్ణ ప్రసాద్ (60), లలిత దంపతులు. వీరిద్దరూ స్థానికంగా మెడికల్ షాపు నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్దకొడుకు దినేష్ కర్నూల్ లోని ప్రైవేట్ ఆసుపత్రిలో పనిచేస్తుండగా.. చిన్న కొడుకు కెనడాలో స్థిరపడ్డాడు.
సోమవారం (మే29) ఉదయం హరికృష్ణప్రసాద్ ఇంటిలో నుండి పొగలు రావడాన్ని స్థానికులు గమనించి పోలీసులకు సమాచారమిచ్చారు. ఎస్సై వెంకటేశ్వర్లు తన సిబ్బందితో కలిసి ఘటనా ప్రాంతానికి చేరుకుని ఇంట్లో ఏం జరిగిందని లలితను ఆరా తీశారు. తన భర్త గుండెపోటుతో సోమవారం ఉదయం మృతి చెందినట్లు లలిత పోలీసులకు తెలిపింది. తమ కుమారులిద్దరూ తమను సరిగ్గా చూసుకోవడం లేదని, ఆస్తి కోసం మాత్రమే వస్తున్నారని చెప్పి విలపించింది. తండ్రి చనిపోయాడన్న విషయం చెబితే ఇద్దరూ ఆస్తికోసం గొడవ చేస్తారన్న భయంతో.. తానే ఇంట్లో ఉన్న అట్టపెట్టెలతో, చీరలతో ఇంట్లోనే దహన సంస్కారాలు చేసినట్లు వివరించింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story