Mon Dec 23 2024 08:13:21 GMT+0000 (Coordinated Universal Time)
మళ్లీ ఆడపిల్లే పుట్టిందని తండ్రి ఆత్మహత్య
ఆడపిల్ల పుడితే ఎలా వదిలించుకోవాలో అని ఆలోచించేవారే ఎక్కువ. ఆడపిల్లలు అన్నిరంగాల్లో..
ఆడపిల్ల పుడితే.. ఇంటికి మహాలక్ష్మి వచ్చిందని భావించేవారు చాలా తక్కువ. ఈ రోజుల్లో ఆడపిల్ల పుడితే ఎలా వదిలించుకోవాలో అని ఆలోచించేవారే ఎక్కువ. ఆడపిల్లలు అన్నిరంగాల్లో రాణిస్తున్నా.. ఆడపిల్ల అంటే భారంగానే భావిస్తున్నారు. అలా భావించిన ఓ తండ్రి సోమవారం బలవన్మరణానికి పాల్పడ్డాడు. తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. అత్తాపూర్ ఔట్పోస్ట్ ఎస్సై కిషన్జీ తెలిపిన వివరాల ప్రకారం.. సులేమాన్నగర్కు చెందిన మహ్మద్ అహ్మద్(35) ఓ ఫర్నీచర్ షాపులో పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.
అతనికి ఇప్పటికే ఇద్దరు ఆడపిల్లలున్నారు. భార్య మూడో కాన్పుకోసం 15 రోజుల క్రితం కర్ణాటకలోని పుట్టింటికి వెళ్లింది. మరోమారు ఆడపిల్లకు జన్మనిచ్చింది. దీంతో.. మనస్తాపానికి గురైన అహ్మద్ కొన్ని రోజులుగా అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్నాడు. ఈ క్రమంలోనే అతను సోమవారం ఇంట్లో ఎవరూలేని సమయంలో ఫ్యాన్ కు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. స్థానికుల సమాచారంతో ఘటనా ప్రాంతానికి చేరుకున్న పోలీసులు.. అహ్మద్ మృతదేహాన్ని ఉస్మానియాకు తరలించి, కుటుంబ సభ్యులకు విషయం చెప్పారు.
Next Story