Mon Dec 23 2024 17:28:31 GMT+0000 (Coordinated Universal Time)
భార్య రాసిన మరణశాసనం.. పోలీసులనే విస్మయానికి గురిచేసిన హత్య
చికెన్ వ్యర్థాలతోపాటు మృతదేహాన్ని ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా రెడ్డిగూడెం మండలం కుదప తీసుకెళ్లి అక్కడే ప్రైవేటు చేపల..
పెళ్లినాడు చేసిన ప్రమాణాలను మరిచిపోయి.. తమ శారీరక సుఖం కోసం జీవిత భాగస్వాములను అంతం చేసేందుకు సైతం వెనుకాడట్లేదు. ప్రియుడు లేదా ప్రియురాలి మోజులో పడి తమతో జీవితాలను పంచుకునేందుకు వచ్చిన వారిని గుట్టుచప్పుడు కాకుండా అంతమొందిస్తున్నారు. తన వివాహేతర బంధానికి అడ్డుగా ఉన్న భర్తను ప్రియుడితో కలిసి చంపేసిందో భార్య. ఇది భార్యరాసిన మరణశాసనం. ఈ ఘటన ఖమ్మం జిల్లాలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే..
ఖమ్మం గ్రామీణం మండలం ఆరెంపులకు చెందిన సాయిచర్ (28), కొణిజర్ల మండలానికి చెందిన యువతి (25) నాలుగేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. సాయి ఖమ్మం నగరంలో చికెన్ వ్యర్థాలు తరలించే వాహన డ్రైవర్ గా పనిచేస్తుండేవాడు. అదే వాహనంలో మరో యువకుడు కరుణాకర్ (30) కూడా పనిచేసేవాడు. ఇద్దరి మధ్య పరిచయం స్నేహంగా మారడంతో.. కరుణాకర్ తరచూ సాయి ఇంటికి వచ్చి వెళ్తుండేవాడు. ఈ క్రమంలో సాయి భార్యతో కరుణాకర్ కు పరిచయం ఏర్పడి.. అది వివాహేతర సంబంధంగా మారింది. ఈ విషయం సాయికి తెలియడంతో.. భార్యతో తరచూ గొడవపడేవాడు. భర్తకు తన గురించి తెలిసిపోయిందని, ఈ విషయం ఇంకెవరికైనా తెలిస్తే పరువు పోతుందని భావించిన ఆమె.. ప్రియుడితో కలిసి సాయిని హతమార్చాలనుకుంది.
పదకం ప్రకారం ఆగస్టు 1వ తేదీ రాత్రి చికెన్ వ్యర్థాలు తీసుకెళ్లేందుకు సాయి, కరుణాకర్ సిద్ధమయ్యారు. మరో ఇద్దరు డ్రైవర్లతో కలిసి మద్యం తాగారు. ఆ సమయంలో సాయి కరుణాకర్ ను తన భార్యతో ఎందుకు చనువుగా ఉంటున్నావని నిలదీశాడు. ఇద్దరి మధ్యా మాటామాటా పెరిగి కొట్టుకునేంతవరకూ వెళ్లింది. ఈ క్రమంలో మద్యం మత్తులో ఉన్న కరుణాకర్ సాయి ని బలంగా తోసివేయడంతో సాయి ట్రాలీ ఆటోకు గుద్దుకున్నాడు. అనంతరం సాయిని పారతో బలంగా కొట్టడంతో అక్కడే చనిపోయాడు. సాయి హత్య పై ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు చికెన్ వ్యర్థాల వాహనంలో పడేశాడు.
చికెన్ వ్యర్థాలతోపాటు మృతదేహాన్ని ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా రెడ్డిగూడెం మండలం కుదప తీసుకెళ్లి అక్కడే ప్రైవేటు చేపల చెరువులో పడేశాడు. మృతదేహం పైకి తేలకుండా బలమైన రాయి కట్టాడు. మూడ్రోజుల తర్వాత మృతదేహం పైకి తేలడంతో చెరువు యజమాని కరుణాకర్ కు ఫోన్ చేశాడు. ఆ తర్వాత కరుణాకర్ ఆ మృతదేహాన్ని పక్కనున్న ఊరి చెరువులో పడేసి, ఆ విషయాన్ని సాయి భార్యకు చెప్పాడు. ఆగస్టు 1న సాయి హత్యకు గురవ్వగా.. 10 రోజుల పాటు ఎక్కడా ఈ విషయం ఆరా రాలేదు. ఆ తర్వాత సాయి కనిపించకపోవడాన్ని గమనించిన బంధువులు భార్యను ప్రశ్నించగా తెలీదని చెప్పింది. ఏమీ ఎరగనట్లు ఖమ్మం టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దర్యాప్తులో భాగంగా సాయి భార్య ఫోన్ కాల్ డేటా పరిశీలించగా ఎక్కువగా కరుణాకర్ తో మాట్లాడినట్లు తెలిసింది. కరుణాకర్ ను విచారించగా సాయిని హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. కానీ 25 రోజులవుతున్నా సాయి మృతదేహం దొరక్కపోవడంపై బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Next Story