Fri Nov 22 2024 21:40:30 GMT+0000 (Coordinated Universal Time)
అమానవీయం.. వైద్యుల నిర్లక్ష్యంతో నిండు బాలింత, కవలలు మృతి
తొమ్మిది నెలల గర్భిణి అయిన కస్తూరి అనే మహిళ తుముకూరు జిల్లాలోని, భారతీ నగర్ పరిధిలో ఒక అద్దె ఇంట్లో ఒంటరిగా..
ఈ మధ్యకాలంలో మానవత్వానికే మచ్చ తెచ్చే ఘటనలెన్నో చూస్తున్నాం. వైద్యుడు దేవుడితో సమానం అంటారు. మనకు ఏ చిన్న అనారోగ్యం వచ్చినా వెంటనే వైద్యుల్ని సంప్రదిస్తాం. ప్రతి అనారోగ్యానికి.. ప్రత్యేక ఆస్పత్రులు ఉన్నాయి. అలాగే గర్భిణుల కోసం కూడా ప్రత్యేక విభాగాలున్నాయి. కానీ.. ఓ గర్భిణీ విషయంలో వైద్య సిబ్బంది అమానవీయంగా ప్రవర్తించడంతో.. నిండు బాలింత, అప్పుడే జన్మించిన కవలలు మరణించారు. ఈ ఘటన కర్ణాటకలోని తుముకూరు జిల్లాలో జరిగింది.
తొమ్మిది నెలల గర్భిణి అయిన కస్తూరి అనే మహిళ తుముకూరు జిల్లాలోని, భారతీ నగర్ పరిధిలో ఒక అద్దె ఇంట్లో ఒంటరిగా ఉంటోంది. కస్తూరికి ఒక కూతురు ఉంది. మళ్లీ గర్భం దాల్చింది. కానీ.. తనను జాగ్రత్తగా చూసుకునేందుకు ఇంట్లో ఎవరూ లేరు. బుధవారం పురిటినొప్పులు మొదలయ్యాయి. కుటుంబ సభ్యులు ఎవరూ లేకపోవడంతో.. స్థానికులే కొంత డబ్బును సేకరించి.. సమీపంలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ ఆమెను పరీక్షించిన వైద్యులు ఆమెకు ఆధార్ కార్డు, ఆస్పత్రి రిజిస్ట్రేషన్ కార్డు వంటివి లేకపోవడంతో ఆస్పత్రిలో చేర్చుకునేందుకు నిరాకరించారు. అంతగా కావాలంటే బెంగళూరులోని విక్టోరియా ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించారు.
దాంతో స్థానికులు ఏమీ చేయలేక ఆమెను తిరిగి ఇంటికి తీసుకొచ్చేశారు. ఒంటరిగా ఉన్న సమయంలో పురిటినొప్పులు మరింత ఎక్కువయ్యాయి. ఇంట్లోనే కవలలకు(ఆడబిడ్డలు) జన్మనిచ్చింది కస్తూరి. కానీ.. ఆ సమయంలో దగ్గర ఎవరూ లేకపోవడం.. ఎలాంటి వైద్య సదుపాయం లేకపోవడంతో తీవ్ర రక్తస్రావమైంది. దాంతో కస్తూరి అక్కడే కన్నుమూసింది. బొడ్డుపేగు కూడా తెంచుకోని కవలలు కూడా కొద్దిసేపటికే ప్రాణాలొదిలారు. ఈ ఘటనపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కస్తూరిని ఆస్పత్రిలో చేర్చుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేశారు. దీనిపై స్పందించిన కర్ణాటక ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఈ ఘటనలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన నలుగురు వైద్య సిబ్బందిని సస్పెండ్ చేసింది.
Next Story