Mon Dec 23 2024 09:32:54 GMT+0000 (Coordinated Universal Time)
మ్యాట్రిమోనీ చీటర్ : నిన్నే పెళ్లాడుతానంటూ రూ.46 లక్షలు కాజేసింది.
నగరానికి చెందిన ఓ వ్యక్తి మ్యాట్రిమోనీ సైట్ లో తన ప్రొఫైల్ పెట్టాడు. అతని ప్రొఫైల్ కు ఓ యువతినుంచి మెసేజ్
హైదరాబాద్ : రోజురోజుకూ సైబర్ మోసాలతో పాటు.. మ్యాట్రిమోనియల్ మోసాలు కూడా ఎక్కువైపోతున్నాయి. ఉన్నదంతా పోగొట్టుకున్నాక గానీ.. తాము మోసపోతున్నామని గ్రహించలేకపోతున్నారు బాధితులు. తాజాగా భాగ్యనగరంలో మరో మ్యాట్రిమోనీ చీటింగ్ ఘటన వెలుగులోకొచ్చింది. నిన్నే పెళ్లాడుతానని ఓ మహిళ ఘరానా మోసానికి తెరతీసింది. మ్యాట్రిమోనీలో పరిచయమై.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి, ఓ వ్యక్తి నుంచి ఏకంగా రూ.46 లక్షలు కాజేసింది.
వివరాల్లోకి వెళ్తే.. నగరానికి చెందిన ఓ వ్యక్తి మ్యాట్రిమోనీ సైట్ లో తన ప్రొఫైల్ పెట్టాడు. అతని ప్రొఫైల్ కు ఓ యువతినుంచి మెసేజ్ వచ్చింది. "నీ ప్రొఫైల్ నాకు నచ్చింది, నిన్ను పెళ్లి చేసుకుంటా" అని ఆ యువతి అతడిని నమ్మించింది. ఆ తర్వాత పలు కారణాలు చెప్పి అతడి నుంచి డబ్బు లాగడం మొదలు పెట్టింది. ఇంజినీరింగ్ చదువుతున్నానని, ఫీజులు కట్టాలని ఓసారి, తల్లికి కోవిడ్ వచ్చిందని మరోసారి.. ఇలా పలు రకాల కారణాలు చెప్పి.. పలు విడతల్లో ఏకంగా రూ.46 లక్షలు కాజేసింది ఆ కిలాడీ లేడీ.
రోజులు గడిచే కొద్దీ ఆమె ఇంకా ఎక్కువ డబ్బులు అడగడం మొదలు పెట్టింది. పైగా పెళ్లి ప్రస్తావనే లేదు. దాంతో అనుమానం వచ్చిన బాధితుడు.. తాను మోసపోయానని తెలుసుకున్నాడు. వెంటనే హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతని ఫిర్యాదు మేరకు.. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇలా ముక్కూ మొహం తెలియని అమ్మాయిలను గుడ్డిగా నమ్మితే.. భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
Next Story