Mon Dec 23 2024 14:48:56 GMT+0000 (Coordinated Universal Time)
ఏడాదిగా సహజీవనం.. మరొకరితో నిశ్చితార్థం.. ఆఖరికి ఇలా !
భార్యా భర్తలమని చెప్పి ఇల్లు అద్దెకు తీసుకుని సహజీవనం చేశారు. పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. ఆఖరికి కథ అడ్డం తిరిగింది
వాళ్లిద్దరూ కలిసి చదువుకున్నారు. ఆ తర్వాత ఎవరి వృత్తి రీత్యా వారు బిజీ అయిపోయారు. మళ్లీ ఫేస్ బుక్ ద్వారా కలుసుకున్నారు. ఒకరినొకరు ఇష్టపడ్డారు. భార్యా భర్తలమని చెప్పి ఇల్లు అద్దెకు తీసుకుని సహజీవనం చేశారు. పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. ఆఖరికి కథ అడ్డం తిరిగింది. ఫలితంగా ఆ యువతి ఆత్మహత్య చేసుకోగా.. యువకుడిపై కేసు నమోదైంది. ఈ ఘటన హైదరాబాద్ కేపీహెచ్ బీ కాలనీలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు పట్టణానికి చెందిన యువతి (34), వేంసూరు మండలం కందూకూరుకి చెందిన బండి గౌతమ్ (32)లు కలిసి బీ ఫార్మసీ చదివారు. హైదరాబాద్ లో ప్రైవేటు జాబు చేస్తున్న ఇద్దరూ మూడేళ్ల క్రితం మళ్లీ ఫేస్ బుక్ ద్వారా కలుసుకున్నారు.
ఏడాది కాలంగా సహజీవనం
గౌతమ్ ఆమెను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుందామని చెప్పడంతో.. యువతి కూడా ఓకే చెప్పింది. ఇద్దరూ కలిసి ఉండాలనుకున్నారు. భార్య భర్తలని చెప్పి కేపీహెచ్ బీ 5వ ఫేజ్ లో ఓ ఇల్లు అద్దెకు తీసుకుని, ఏడాదిగా సహజీవనం చేస్తున్నారు. ఇంతలోనే గౌతమ్ బుద్ధి మారింది. తన ప్రియురాలి కళ్లుగప్పి ఇంట్లో వారు చూపించిన అమ్మాయితో నిశ్చితార్థం చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న యువతి అతడితో గొడవ పెట్టుకుంది. ఆ తర్వాత ఈ నెల 16వ తేదీన గౌతమ్ ఖమ్మం వెళ్లాడు. 17వ తేదీ సాయంత్రం యువతి గౌతమ్ కు వీడియో కాల్ చేసి ఆత్మహత్య చేసుకుంటున్నట్లు తెలిపింది. దీంతో కంగారుపడిన అతను.. వెంటనే ఇంటిపై అంతస్తులో ఉన్నవారికి ఫోన్ చేసి విషయం చెప్పాడు. వారు వెళ్లి చూసే సరికే యువతి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. దీంతో వారు కేపీహెచ్ బీ పోలీసులకు సమాచారం ఇచ్చారు. యువతి ఆత్మహత్యతో.. ఆమె కుటుంబ సభ్యులు గౌతమ్ పై పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గౌతమ్ ను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.
Next Story