Mon Dec 23 2024 06:47:08 GMT+0000 (Coordinated Universal Time)
ప్రియుడితో నిశ్చితార్థం.. మనస్తాపంతో యువతి ఆత్మహత్య
ఇద్దరూ తమ తల్లిదండ్రులను ఒప్పించి పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ఇరు కుటుంబాలు వీరి ప్రేమను అంగీకరించాయి.
వాళ్లిద్దరూ ప్రేమించుకున్నారు. ఆ ప్రేమను పెళ్లి వరకూ తీసుకెళ్లాలని భావించి ఇరు కుటుంబాల్లో పెద్దలను ఒప్పించారు. ఈ ఏడాది మార్చిలో ఇద్దరికీ నిశ్చితార్థం జరిగింది. జూన్ 10న వివాహం కూడా జరిపించేందుకు ముహూర్తం ఖరారైంది. పెళ్లి పనులు జరుగుతున్నాయి. ఇంతలోనే ఆ యువతి మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడింది. అందుకు కారణం ప్రియుడే.
వివరాల్లోకి వెళ్తే.. కర్నూల్ జిల్లా ఇందిరాగాంధీ నగర్ కు చెందిన పద్మావతి, నందికొట్కూరు మండలం పాతకోటకు చెందిన వినోద్ ఐదేళ్లు ప్రేమించుకున్నారు. ఇద్దరూ తమ తల్లిదండ్రులను ఒప్పించి పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ఇరు కుటుంబాలు వీరి ప్రేమను అంగీకరించాయి. యువతి తల్లిదండ్రులను కూడా ఆ యువకుడే ఒప్పించాడు. ప్రాణంగా ప్రేమించిన వాడే భర్తగా వస్తుండటంతో ఆనందంతో ఆ యువతి తబ్బిబ్బైంది. ఈ ఏడాది మార్చి 9న వీరి నిశ్చితార్థం జరిగింది. జూన్ 10న పెళ్లికి పెద్దలు ముహూర్తం ఫిక్స్ చేశారు. అంతా బాగానే జరుగుతుందనుకుంటున్న సమయంలో వినోద్ ఊహించని షాకిచ్చాడు.
ఒక్క ఫోన్ కాల్ ఆ అమ్మాయి జీవితాన్ని తలకిందులు చేసింది. పోలీసులు ఫోన్ చేసి వినోద్ అనే యువకుడికి మే31న పెళ్లైపోయిందని, ఏమైనా సందేహాలుంటే పోలీస్ స్టేషన్ కు రావాలని తెలిపారు. ఐదు సంవత్సరాల ప్రేమ. అతనే ప్రాణంగా ఎన్నోకలలు కన్న పద్మావతి.. అతను మోసాన్ని తట్టుకోలేకపోయింది. తీవ్ర మనస్తాపానికి గురై.. సూసైడ్ నోట్ రాసి పురుగుల మందులు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. గమనించిన తల్లిదండ్రులు కర్నూలు ఆసుపత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. తమ కుమార్తెను దారుణంగా మోసం చేసి, ఆమె చావుకి కారణమైన వినోద్ ను కఠినంగా శిక్షించాలని పద్మావతి తల్లిదండ్రులు కోరారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story