Mon Dec 23 2024 14:00:44 GMT+0000 (Coordinated Universal Time)
మరో దారుణం.. బాలింతపై సామూహిక హత్యాచారం
బహిర్భూమికి వెళ్లిన మహిళ ఎంతసేపటికీ ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆమె కోసం వెతుకగా.. ఊరిబయట..
కనగానపల్లి : ఆంధ్రప్రదేశ్ లో అబలలపై వరుసగా దారుణాలు జరుగుతూనే ఉన్నాయి. చిన్న, పెద్ద, ముసలి-ముతక తేడా లేదు. గర్భిణీ స్త్రీలు, బాలింతలను సైతం వదలడం లేదు కామాంధులు. ఇటీవలే శ్రీసత్యసాయిజిల్లా గోరంట్లలో బీటెక్ విద్యార్థినిపై జరిగిన దారుణాన్ని మరువకముందే.. మరో దారుణ ఘటన వెలుగుచూసింది. జిల్లాలో బహిర్భూమికి వెళ్లిన బాలింతపై.. దుండగులు సామూహిక అత్యాచారం చేసి.. ఆపై బండరాయితో మోది హతమార్చారు.
వివరాల్లోకి వెళ్తే.. కనగానపల్లి మండలానికి చెందిన మహిళకు ఏడేళ్లక్రితం వివాహమైంది. ఏడునెలల క్రితమే ఆమె పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. 10 రోజుల క్రితమే కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకుంది. సోమవారం ఉదయం బాబును తన తోడికోడలకు అప్పగించి, బహిర్భూమికి వెళ్లింది. అప్పటికే.. అక్కడ కాపుకాసిన దుండగులు.. ఆమెను బంధించి.. అత్యాచారం చేసి.. బండరాయితో మోది హత్య చేశారు.
బహిర్భూమికి వెళ్లిన మహిళ ఎంతసేపటికీ ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆమె కోసం వెతుకగా.. ఊరిబయట విగతజీవిగా కనిపించింది. వెంటనే పోలీసులకు సమాచారమివ్వగా.. వారు ఘటనా ప్రాంతానికి చేరుకుని పరిసరాలను పరిశీలించారు. మహిళ ముఖం పూర్తిగా ఛిద్రమైంది. సమీపంలోని బావి వద్ద ఉన్న బండరాళ్లకు తెచ్చి ఆమెను హత్య చేసినట్లు ప్రాథమికంగా నిర్థారించారు. కాగా.. బాధితురాలిని పక్కా ప్లాన్ ప్రకారం.. గ్రామానికి చెందిన కొందరు ఆమెను ఊరి బయటకు పిలిపించి హత్య చేసినట్లుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నిందితులు బంధువుల్లోనే కొందరు అయి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. హత్యకు ముందు ఆమెపై సామూహిక అత్యాచారం చేసి ఉంటారని అక్కడున్న ఆధారాలను బట్టి తెలుస్తుందన్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి.. నలుగురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.
Next Story