Mon Nov 18 2024 02:24:11 GMT+0000 (Coordinated Universal Time)
దేశరాజధానిలో ఘోర ప్రమాదం.. యువతిని 12 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లిన వైనం
ఢిల్లీలోని సుల్తాన్ పురిలో జరిగిన ఈ ప్రమాదం తాలూకు వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. బాధిత యువతి ఓ ఫంక్షన్ కు హాజరై..
దేశమంతా న్యూ ఇయర్ వేడుకలు జరుపుకుంటున్న వేళ.. దేశ రాజధానిలో ఘోర ప్రమాదం జరిగింది. పూటుగా తాగి.. మద్యంమత్తులో కారు నడిపిన యువకులు ఎదురుగా వచ్చిన స్కూటీని ఢీ కొట్టారు. స్కూటీ నడుపుతున్న యువతి కారు కింద పడిపోయింది. మద్యంమత్తులో ఉన్న యువకులు.. కారుకింద ఇరుక్కున్న యువతిని అలాగే 12 కిలోమీటర్ల వరకూ ఈడ్చుకెళ్లగా.. యువతి తీవ్రగాయాలపాలై ప్రాణాలు విడిచింది. నూతన సంవత్సరంలో తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఈ దారుణం జరిగింది.
ఢిల్లీలోని సుల్తాన్ పురిలో జరిగిన ఈ ప్రమాదం తాలూకు వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. బాధిత యువతి ఓ ఫంక్షన్ కు హాజరై.. తిరిగి స్కూటీపై ఇంటికి వెళ్తుండగా.. న్యూ ఇయర్ వేడుకల్లో భాగంగా మద్యం సేవించిన ఐదుగురు యువకులు బలెనో కారును వేగంగా నడుపుతూ యువతి డ్రైవ్ చేస్తున్న వాహనాన్ని ఢీ కొట్టారు. ఆ తర్వాత యువతిని అలాగే ఈడ్చుకెళ్తుండగా.. గమనించిన వాహనదారులు పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు అక్కడికి చేరుకునే లోపు జరగాల్సిన దారుణం జరిగిపోయింది.
ఓ చోట కారు నుంచి యువతి శరీరం విడిపడిపోయింది. యువతి శరీరంపై బట్టలన్నీ పీలికలై.. తీవ్ర గాయాలతో మరణించింది. పోలీసులు యువతి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కు తరలించారు. ప్రమాదానికి కారణమైన ఐదుగురినీ అరెస్ట్ చేశారు. కాగా.. ఈ ప్రమాదం వెనుక లైంగిక వేధింపులు కూడా ఉన్నాయని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా స్పందిస్తూ.. సిగ్గుతో తలవంచుకోవాల్సిన దారుణమన్నారు. నిందితుల్ని వదలబోమని, కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
Next Story