Mon Dec 23 2024 06:47:08 GMT+0000 (Coordinated Universal Time)
ప్రేమ పేరుతో వేధింపులు.. యువకుడి దారుణ హత్య
గతేడాది యువతి తల్లిదండ్రులు సీసీ ప్రాంతానికి చెందిన మరో వ్యక్తితో యువతికి వివాహం జరిపించారు. తనను కాదని మరో వ్యక్తిని..
ప్రేమ పేరుతో వేధిస్తోన్న యువకుడు పట్టపగలే దారుణ హత్యకు గురయ్యాడు. తెలంగాణలోని మంచిర్యాల జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. జైపూరు మండలం ఇందారంలో.. అంతా చూస్తుండగానే యువకుడిని బండరాళ్లతో కొట్టి చంపడంతో.. స్థానికంగా కలకలం రేగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇందారం గ్రామానికి చెందిన ఓ యువతి, ఎం.మహేశ్ (24) అనే యువకుడు ప్రేమించుకున్నారు.
గతేడాది యువతి తల్లిదండ్రులు సీసీ ప్రాంతానికి చెందిన మరో వ్యక్తితో యువతికి వివాహం జరిపించారు. తనను కాదని మరో వ్యక్తిని పెళ్లాడిన యువతిపై మహేశ్ కక్ష పెంచుకున్నాడు. ప్రేమించుకున్న సమయంలో ఆమెతో సన్నిహితంగా ఉన్న వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ విషయం తెలుసుకున్న యువతి తల్లిదండ్రులు మహేశ్ పై జైపూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇరువర్గాలను పిలిచి పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చి పంపారు.
ఈ క్రమంలో వీడియోలను చూసిన యువతి భర్త ఆరునెలల క్రితం విడాకులు ఇచ్చి, మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు. విడాకులు తీసుకోవడంతో యువతి పుట్టింట్లోనే ఉంటోంది. ఆమెకు మహేశ్ వేధింపులు మరింత ఎక్కువయ్యాయి. ఈ క్రమంలో మరోసారి యువతి కుటుంబసభ్యులు పోలీసులను ఆశ్రయించారు. వేధింపులు కొనసాగుతుండటంతో మంగళవారం (ఏప్రిల్ 25) ఉదయం మహేశ్ పై యువతి కుటుంబ సభ్యులు కత్తి, బండరాళ్లతో దాడి చేసి దారుణంగా హతమార్చారు. సమాచారం అందుకున్న స్థానిక ఏసీపీ నరేందర్, ఎస్సై రామకృష్ణ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మహేశ్ పై దాడిచేసిన నిందితులు పరారీలో ఉండటంతో వారికోసం గాలింపు చర్యలు చేపట్టారు.
Next Story